Ponguleti Srinivas Reddy: ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొందరు కోరుతున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే.... స్పందించిన మంత్రి పొంగులేటి

- బీఆర్ఎస్ నేతలు అధికార దాహంతో మాట్లాడుతున్నారన్న మంత్రి
- ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే కూల్చేస్తామని మాట్లాడుతున్నారని విమర్శ
- ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ పగటి కలలు కంటున్నారని విమర్శ
ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొందరు కోరుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికార దాహంతో తమ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే కూల్చివేస్తామని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచన మేరకే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని అన్నారు. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కంటున్నారని అన్నారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ఆత్మ అని పొంగులేటి అన్నారు. తమ ప్రభుత్వంపై మొదటి నుంచి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలని తండ్రీ కొడుకులు చూస్తున్నారని కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి అన్నారు.
పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు
పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. అర్హులైన అందరికీ సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే జీవోను విడుదల చేశామని అన్నారు. భూభారతి వచ్చాక కొత్త ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన భయాందోళనకు గురవుతున్నారని అన్నారు.