Vijay Sethupathy: పూరితో సినిమా ఓకే చేసింది అందుకేనట... విజయ్ సేతుపతి స్పందన!

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతితో తన తర్వాతి ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభంకానుంది.
అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై హీరో విజయ్ సేతుపతి స్పందించారు. ఫ్లాప్‌లతో సతమవుతున్న పూరి జగన్నాథ్‌తో సినిమా ఎలా ఓకే చేశారు అనే ప్రశ్నకు సేతుపతి బదులిచ్చారు. దర్శకులను తాను వారి గత సినిమాల ఫలితాలతో జడ్జ్ చేయనని చెప్పారు. స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా చేస్తానని స్పష్టం చేశారు.
పూరి చెప్పిన స్టోరీ తనకు చాలా బాగా నచ్చింది, అందుకే ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇలాంటి కథను ఇప్పటివరకూ తాను చేయలేదన్నారు. తాను ఎప్పుడూ కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తానని, గతంలో చేసిన స్టోరీలను పునరావృతం కాకుండా జాగ్రత్తపడతానంటూ వివరించారు. పూరితో తాను చేయబోతున్న మూవీ షూటింగ్ జూన్‌లో మొదలవుతుందని చెప్పుకొచ్చారు.
ఇక ఒకప్పుడు బ్లాక్ బస్టర్‌లతో పాటు ఇండస్ట్రీ హిట్‌లను అందించిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం సరైన విజయం కోసం తపిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతితో చేతులు కలిపారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ‘పూరి కనెక్ట్స్’ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నటి టబు కీలక పాత్రలో నటించనున్నట్లు ఇటీవలే మేకర్స్ వెల్లడించారు.