Online Fraud: ఆన్ లైన్ స్కామర్ ను ఆటపట్టించిన యువతి.. వీడియో ఇదిగో!

- 18 వేలు కాజేసేందుకు చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేసిన వైనం
- 2 వేలకు బదులుగా పొరపాటున 20 వేలు పంపినట్లు టెక్ట్స్ మెసేజ్ చేసిన మోసగాడు
- అదే మెసేజ్ ను ఎడిట్ చేసి 18 వేలు పంపించినట్లు రిప్లై ఇచ్చిన యువతి
ఆర్థిక వ్యవహారాల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ యువతి సూచించింది. ఇటీవల ఆన్ లైన్ స్కామర్ ఒకరు తనను ఎలా మోసం చేయడానికి ప్రయత్నించింది, దానిని తాను ఎలా తిప్పికొట్టింది వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆ యువతికి కాల్ చేసిన మోసగాడు తనను తాను ఆమె తండ్రి స్నేహితుడినని పరిచయం చేసుకున్నాడు. దీంతో ఆ యువతి నమస్తే అంకుల్ అంటూ పలకరించింది.
యువతి తండ్రికి తాను రూ.12 వేలు ఇవ్వాలని, ఆ మొత్తాన్ని యువతికి ఆన్ లైన్ పేమెంట్ చేయాలని చెప్పాడన్నాడు. దీంతో విషయం అర్థం చేసుకున్న యువతి.. తనకు ఏమీ తెలియనట్లు అమాయకంగా నటించింది. రూ.12 వేలను బదిలీ చేస్తున్నట్లు చెప్పిన మోసగాడు.. తొలుత రూ.10 వేలు పంపినట్లు టెక్ట్స్ మెసేజ్ చేశాడు. దానికి ఆ యువతి పదివేలు వచ్చాయని చెప్పగానే మిగతా రెండు వేలు పంపిస్తున్నానంటూ రూ.20 వేలు పంపినట్లు మెసేజ్ చేశాడు. అయ్యో అంకుల్ మీరు రూ.2 వేలకు బదులు రూ.20 వేలు పంపించారంటూ యువతి అమాయకంగా చెప్పడం వీడియోలో చూడొచ్చు. దీనికి ఆ మోసగాడు అరెరె.. పొరపాటు జరిగిపోయిందే అంటూ విచారం నటించాడు.
రూ.2 వేలు ఉంచేసుకుని మిగతా రూ.18 వేలు తనకు పేటీయం చేయాలని కోరాడు. దీనికి సరేనన్న యువతి.. ఆ మోసగాడు తనకు పంపిన మెసేజ్ ను ఎడిట్ చేసి రూ.18 వేలు ట్రాన్స్ ఫర్ చేసినట్లు జవాబిచ్చింది. మెసేజ్ చూసిన మోసగాడు.. ఆ యువతి అమాయకురాలు కాదు గడుగ్గాయేనని గ్రహించాడు. ఇక చేసేదేంలేక ఆశీర్వదిస్తూ ఫోన్ పెట్టేశాడు. ఇదంతా మరో ఫోన్ తో రికార్డు చేసిన యువతి.. వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ‘ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి’ అని సూచించింది.