Uttar Pradesh: నగదు అడిగిన టోల్ ప్లాజా సిబ్బంది... రెచ్చిపోయిన మహిళ.. ఉద్యోగిపై దాడి!

- యూపీ హాపూర్‌లోని చిజార్సి టోల్ ప్లాజా వద్ద ఘటన
- ఆమె కారుకున్న ఫాస్టాగ్ ఖాతాలో అమౌంట్ లేకపోవడంతో నగదు చెల్లించమన్న సిబ్బంది
- దాంతో కోపం తెచ్చుకున్న మహిళ సిబ్బందితో వాగ్వాదం
- అనంతరం బూత్‌లోకి ప్రవేశించి ఉద్యోగిపై దాడి
ఉత్తరప్రదేశ్ హాపూర్‌లోని చిజార్సి టోల్ ప్లాజా వద్ద ఓ మహిళ వీరంగం సృష్టించింది. టోల్ డబ్బులు అడిగిన ఉద్యోగిపై చేయిచేసుకుంది. బూత్‌లోకి వెళ్లి అతనిని కొట్టడం ప్రారంభించడంతో టోల్ కార్మికుడు ఆశ్చర్యపోయాడు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో ఆ మహిళ బూత్‌లోకి దూసుకెళ్లి ఉద్యోగిని చెంపలపై ఎడాపెడా కొట్టడం కనిపిస్తుంది. ఇతర వాహనదారులు ఆపినా ఆమె రెచ్చిపోవడం వీడియోలో ఉంది. సదరు మహిళ ఘజియాబాద్ నుంచి కారులో వస్తున్నారు. ఆమె కారుకు ఉన్న ఫాస్టాగ్ ఖాతాలో అమౌంట్ లేకపోవడంతో నగదు చెల్లించమని ఉద్యోగి అడిగాడు.
దాంతో కోపం తెచ్చుకున్న మహిళ అతనితో వాదించింది. అనంతరం బూత్‌లోకి ప్రవేశించి ఉద్యోగిపై దాడికి పాల్పడింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
“4 సెకన్లలో 7 చెంపదెబ్బలా? యాక్షన్ సినిమాలో కూడా ఇలాంటి సీన్స్ ఉండవు!” అని ఒకరు, “ఇది కొత్త టోల్ చెల్లింపు పద్ధతినా?” అని మరొకరు కామెంట్ చేశారు. మరో యూజర్ "ఆమె ఒక మహిళ కాబట్టి, ఆమె ఏదైనా చేయగలదా? ఆమె చాలా ఎక్కువ చేసింది!", "ఈ రోజు ఇది చూస్తానని ఊహించలేదు!" అని ఇంకొకరు కామెంట్ చేశారు.