MS Dhoni: అబ్దుల్ సమ్మద్ రన్ ఔట్, అట్లుంటది మరి ధోనీతోటి.. వీడియో ఇదిగో!

--
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ధోనీ అదరగొట్టాడు. సీఎస్కే సారథిగా మరోసారి బాధ్యతలు స్వీకరించాక జట్టును విజయపథంలో నడిపించాడు. వికెట్ల వెనుక చురుగ్గా కదులుతూ ఓ స్టంపౌట్ చేశాడు. ఓ క్యాచ్ పట్టడంతో పాటు చివరి ఓవర్లో అద్భుతమైన త్రో విసిరి అబ్దుల్ సమ్మద్ ను పెవిలియన్ కు పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వికెట్ల వెనక ధోనీ ఉన్నాడనే విషయం బహుశా సమ్మద్ మరిచిపోయాడేమో అంటూ తలా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఆఖరి ఓవర్ లో ఎల్ఎస్జీ బ్యాట్స్ మెన్ అబ్దుల్ సమ్మద్ క్రీజులో ఉండగా పతిరణ బౌలింగ్ చేశాడు. పతిరణ వైడ్ బంతి విసిరాడు. అయితే, చివరి ఓవర్ కావడంతో సమ్మద్ పరుగు కోసం ప్రయత్నించాడు. స్ట్రయిక్ ఎండ్ నుంచి నాన్ స్ట్రయిక్ ఎండ్‌లోకి పరుగుపెడుతుండగా.. అప్పటికే బంతిని అందుకున్న ధోనీ నేరుగా నాన్ స్ట్రయిక్ ఎండ్ లోని వికెట్ల వైపు విసిరాడు. బంతి నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో అబ్దుల్ సమ్మద్ రనౌట్‌గా వెనుదిరిగాడు.