Nrupendra Mishra: అయోధ్య రామాలయం చుట్టూ రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు

- అయోధ్య రామాలయం చుట్టూ నాలుగు కిలోమీటర్ల మేర రక్షణ గోడ
- శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చ
- మందిర నిర్మాణం మరో ఆరు నెలల్లో అన్ని విధాలుగా పూర్తి అవుతుందని వెల్లడి
అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయం చుట్టూ రక్షణగా నాలుగు కిలోమీటర్ల ప్రహరీ గోడ నిర్మించాలని నిర్ణయించారు. ఆలయ నిర్మాణ కమిటీ సమావేశంలో మూడో రోజు పలు విషయాలపై చర్చించారు.
ప్రధానంగా ఆలయ నిర్మాణంలో పురోగతి, కొత్తగా చేసిన భద్రతా ఏర్పాట్లు, విగ్రహాల ప్రతిష్ఠాపన, ఆలయ పరిసరాల్లో అభివృద్ధి వంటి విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. అనంతరం ఆలయ నిర్మాణ కమిటీ చైర్ పర్సన్ నృపేంద్ర మిశ్ర సోమవారం మీడియాతో మాట్లాడుతూ మందిర నిర్మాణం మరో ఆరు నెలల్లో అన్ని విధాలుగా పూర్తవుతుందని తెలిపారు.
రామాలయ సముదాయంలోనే పది ఎకరాల్లో ధ్యాన మందిరాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం కోసం మరో పది ఎకరాల విస్తీర్ణంలో 62 స్టోరేజీ కౌంటర్లను, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. సప్త మండల ఆలయాలకు సంబంధించిన విగ్రహాలన్నీ జైపూర్ నుంచి ఆయా ఆలయాలకు చేరుకున్నాయని తెలిపారు.
ఆలయం చుట్టూ రక్షణగా నాలుగు కిలోమీటర్ల ప్రహరీ గోడ నిర్మించాలని నిర్ణయించామని, ఇది 18 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నామన్నారు. గోడను ఇంజనీర్స్ ఇండియా సంస్థ నిర్మిస్తుందని, దాని ఎత్తు, మందం, డిజైన్ వంటి విషయాలను నిర్ణయించామని, మట్టి పరీక్షలు నిర్వహించిన తర్వాత పని ప్రారంభిస్తామని తెలిపారు.