MS Dhoni: ఐపీఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ చేసిన ధోనీ... మహీ ఖాతాలో రికార్డుల మీద రికార్డులు!

- ఐపీఎల్ చరిత్రలో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయర్‌గా ధోనీ
- టోర్నీలో 200 ఔట్లు చేసిన తొలి వికెట్ కీపర్‌గా మరో రికార్డ్
- అలాగే ఐపీఎల్‌లో అత్యధికసార్లు పీఓటీఎం అవార్డు గెలిచిన రెండో ఆటగాడిగా మహీ
నిన్న లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. చెన్నై విజయంలో మహీ కీలకపాత్ర పోషించాడు.
కీపింగ్‌లో తనదైనశైలిలో అదరగొట్టిన ఎంఎస్‌డీ... బ్యాటింగ్‌లోనూ 11 బంతుల్లోనే 26 పరుగులు చేసి, 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' (పీఓటీఎం) అవార్డు గెలుచుకున్నాడు.
దీంతో ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయర్ (43 ఏళ్ల 281 రోజులు)గా ధోనీ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు స్పిన్నర్ ప్రవీణ్ తాంబే (43 ఏళ్ల 60 రోజులు) పేరిట ఉండేది.
మహేంద్రుడి రికార్డుల మీద రికార్డులు!
ఇక నిన్నటి మ్యాచ్‌లో మహేంద్రుడు రికార్డుల మీద రికార్డులు నమోదు చేశాడు. ఐపీఎల్‌లో 200 ఔట్స్ (స్టంపౌట్లు, రనౌట్లు, క్యాచ్‌లు) చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. అలాగే లీగ్ ప్రారంభం నుంచి అత్యధిక ఇన్నింగ్సుల్లో (132) సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గానూ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన రెండో ఆటగాడిగా అవతరించాడు. ఇప్పటివరకు ధోనీకి 18 పీఓటీఎం అవార్డులు వచ్చాయి. ఈ జాబితాలో రోహిత్ శర్మ (19) అగ్రస్థానంలో ఉన్నాడు.