Deepthi Vangavolu: టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో పోరాడుతున్న తెలుగు విద్యార్థిని దీప్తి

Hit and Run Leaves Indian Student Deepthi Critically Injured in Texas

  • టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని దీప్తి వంగవోలుకు రోడ్డు ప్రమాదం.
  • డెంటన్ నగరంలో శనివారం తెల్లవారుజామున హిట్ అండ్ రన్ ఘటన.
  • దీప్తి పరిస్థితి విషమం, స్నేహితురాలికి స్వల్ప గాయాలు.
  • గుర్తుతెలియని నల్లటి సెడాన్ కారు ఢీకొట్టి పరార్.
  • వాహనం, డ్రైవర్ కోసం డెంటన్ పోలీసుల గాలింపు చర్యలు.

అమెరికాలోని డెంటన్ నగరంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టెక్సాస్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న తెలుగు విద్యార్థిని దీప్తి వంగవోలు తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ప్రమాదంలో ఆమె స్నేహితురాలు గాయపడింది. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్, ఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారైనట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

డెంటన్ పోలీసుల ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 12వ తేదీ (శనివారం) తెల్లవారుజామున 2:12 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డెంటన్‌లోని 2300 బ్లాక్ ఆఫ్ కారిల్ అల్ లాగో డ్రైవ్‌ వద్ద దీప్తి, ఆమె స్నేహితురాలు నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వారిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో దీప్తితో పాటు ఉన్న మరో యువతికి కూడా గాయాలయ్యాయని, ఆమెకు కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని యూఎస్ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆమె గాయాలు ప్రాణాంతకం కాదని తెలుస్తోంది.

దీప్తి వంగవోలు లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ఆధారంగా, ఆమె యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు. మార్చి 2023లో నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అని సమాచారం.

ప్రస్తుతం డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రజల సహాయం కోరుతూ ప్రకటన విడుదల చేశారు.

Deepthi Vangavolu
Texas Car Accident
Hit and Run
University of North Texas
Indian Student
Denton Police
Road Accident
Telugu Student
US Accident
  • Loading...

More Telugu News