Nani: ఈ సినిమాకి నా కుమారుడ్ని కూడా తీసుకెళ్లను: నాని

- మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 3
- మీడియా సమావేశంలో నాని హిట్ 3పై కీలక వ్యాఖ్యలు
- ట్రైలర్ చూస్తే వైలెన్స్ అనిపించవచ్చని కానీ సినిమా చూసేటప్పుడు ఇంత వైలెన్స్ ఏంటనే ఆలోచన రాదన్న నాని
క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'హిట్ 3' ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నాని మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. నాని, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోమవారం విశాఖపట్నంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్రంపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు నాని ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ కావున పిల్లలకు చూపించవద్దని చెప్పడం తన బాధ్యత అని అన్నారు. తన కుమారుడిని కూడా ఈ సినిమాకు తీసుకువెళ్లనని పేర్కొన్నారు. ఈ సినిమా కారణంగా ఓ వర్గం ప్రేక్షకులు తగ్గితే మరో వర్గం ప్రేక్షకులు పెరుగుతారని అన్నారు.
దసరా మూవీలో కూడా వైలెన్స్ ఉందని, అయినా బ్లాక్‌బస్టర్ అయిన విషయాన్ని నాని గుర్తు చేశారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే వైలెన్స్ అనిపించవచ్చని కానీ సినిమా చూసేటప్పుడు ఇంత వైలెన్స్ ఏంటనే ఆలోచన రాదని, ప్రేక్షకులు కథలో లీనమవుతారని నాని చెప్పుకొచ్చారు.