MS Dhoni: టాస్ గెలిచిన సీఎస్కే... కెప్టెన్ గా ధోనీ మ్యాజిక్ పనిచేసేనా?

- ఐపీఎల్ లో నేడు సీఎస్కే × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ
- పాయింట్ల పట్టికలో అట్టడుగున్న చెన్నై
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఎంఎస్ ధోని గతంలో ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించాడు. తన నాయకత్వంలో జట్టుకు అనేక విజయాలు అందించాడు. ఇతర ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ఆటతీరు రాబట్టడంలో ధోనీ తర్వాతే ఎవరైనా అనుకునేలా తన కెప్టెన్సీతో మ్యాజిక్ చేశాడు.
అయితే, ఈ సీజన్ లో రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో జట్టుకు దూరం కావడంతో, కెప్టెన్ గా మహీ మళ్లీ సీఎస్కే పగ్గాలు అందుకున్నాడు. కానీ, మొన్న కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో చెన్నై జట్టు చిత్తుగా ఓడింది. ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడుతోంది. టాస్ గెలిచిన సీఎస్కే సారథి ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇవాళైనా తన ట్రేడ్ మార్క్ కెప్టెన్సీని ధోనీ బయటికి తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
నేటి మ్యాచ్ కోసం చెన్నై జట్టులో రెండు మార్పులు చేసినట్టు ధోనీ వెల్లడించాడు. రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వేలను పక్కనబెట్టి, వారి స్థానంలో ఒవెర్టన్, షేక్ రషీద్ లను తీసుకున్నట్టు తెలిపాడు. మరోవైపు, లక్నో జట్టులో ఒక మార్పు జరిగింది. మిచెల్ మార్ష్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్ లో
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి 5 ఓటములు చవిచూసింది. పాయింట్ల పట్టికలో చివర ఉన్న జట్టు సీఎస్కేనే. లక్నో జట్టు 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు నమోదు చేసింది.