Mahesh Kumar Goud: ఇక్కడి విషయాలపై మాట్లాడే అర్హత మోదీకి లేదు: మహేశ్ కుమార్ గౌడ్

- బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని విధ్వంసాలు కనిపించడం లేదా అని ప్రశ్న
- తెలంగాణ అభివృద్ధికి మోదీ చిల్లి గవ్వ ఇవ్వలేదని విమర్శ
- తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడాలని సూచన
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ), కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మాట్లాడే హక్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్లతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోందని మోదీ చేసిన వ్యాఖ్యలపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తున్న విధ్వంసాలు, చెట్ల నరికివేత నరేంద్ర మోదీకి కనిపించడం లేదా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చిల్లిగవ్వ ఇవ్వని ప్రధానికి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్ర నేతలు చెప్పగానే ఏదో మాట్లాడటం సరికాదని అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేశామని అన్నారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 60 వేల ఉద్యోగాలు, రైతు భరోసా ఇలా ఎన్నో అమలు చేస్తున్నామని అన్నారు.