గోరంట్ల మాధవ్ ఎఫెక్ట్ .. పలువురు పోలీస్ అధికారులపై వేటు

  • గోరంట్ల మాధవ్‌ను కోర్టుకు హజరు పర్చే క్రమంలో ఎస్కార్ట్ సిబ్బంది విధి నిర్వహణ వైఫల్యం
  • ఎస్కార్ట్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు సీరియస్
  • ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐలతో సహా 11 మందిపై సస్పెన్షన్ వేటు
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచే సమయంలో ఎస్కార్ట్ డ్యూటీ నిర్వహించిన అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంపై చర్యలు తీసుకున్నారు. గోరంట్ల మాధవ్‌ను శుక్రవారం గుంటూరు కోర్టుకు హాజరుపరిచే సమయంలో కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు విచారణకు గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయను నియమించారు.

గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు తీసుకువెళ్లిన సమయంలో మాధవ్ ఫోన్‌లో మాట్లాడినా బందోబస్తు సిబ్బంది అభ్యంతరం చెప్పలేదు. మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు ముసుగు వేసుకోవడానికి నిరాకరించడమే కాక తనకే ముసుగు వేస్తారా అంటూ పోలీసులపై మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు వద్ద వాహనం నుంచి దిగి మాధవ్ నేరుగా న్యాయస్థానంలోకి వెళ్లిపోయారు. మాజీ ఎంపీతో పాటు మాజీ పోలీస్ అధికారి కావడం, ఆయన కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో సిబ్బంది ఆయనను నిలువరించలేకపోయారు.

అయితే ఇవన్నీ పోలీసుల వైఫల్యమేనని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో గోరంట్ల మాధవ్‌కు ఎస్కార్ట్‌గా ఉన్న 11 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్‌కు గురైన వారిలో అరండల్‌పేట సీఐ వీరస్వామి, పట్టాభిపురం, నగరపాలెం ఎస్సైలు రాంబాబు, రామాంజనేయులు, ఏఎస్సైలు అంథోని, ఏడుకొండలు, నగరపాలెం పోలీస్ స్టేషన్‌కు చెందిన ఐదుగురు కానిస్టేబుళ్లు, అరండల్‌పేటకు చెందిన ఒక కానిస్టేబుల్ ఉన్నారు. 


More Telugu News