Kollu Ravindra: అలాంటి వ్యక్తి కోసం... గోవులు మృతి చెందాయని భూమన ఆరోపించడం సిగ్గుచేటు: మంత్రి కొల్లు రవీంద్ర

- టీటీడీ గోశాలలో గోవులు మృతి చెందాయని భూమన ఆరోపణలు
- మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్
- విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం
రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని జగన్ రెడ్డి మరియు ఆయన అనుచరులు కుట్ర పన్నుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. గత ఐదేళ్లలో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చిన వ్యక్తి కోసం గోశాలలో ఆవులు మృతి చెందాయంటూ కరుణాకర్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భూమన ఉద్దేశాలను ప్రజలు గమనించాలి
నాస్తికుడినని చెప్పుకునే కరుణాకర్ రెడ్డి ఇప్పుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, దీని వెనుక ఆయన ఉద్దేశాన్ని ప్రజలు గమనించాలని రవీంద్ర అన్నారు. లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కరుణాకర్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వెంకటేశ్వరస్వామిని నల్లరాయి అని దుర్భాషలాడిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి అని ఆయన గుర్తు చేశారు. ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలు చూపిస్తూ గోశాలలో 100 ఆవులు చనిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోశాలను 250 మందికి పైగా పర్యవేక్షిస్తూ, జీయో ట్యాగింగ్ ద్వారా గోవులను సంరక్షిస్తుంటే, జీయోట్యాగింగ్ జరగడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన సదుపాయాలతో, ప్రతిరోజు బ్లీచింగ్ చల్లుతూ, గోవులను పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్న కరుణాకర్ రెడ్డి, చైర్మన్‌గా పనిచేసినప్పుడు ప్లాస్మా టీవీల కుంభకోణం, తాళిబొట్ల కుంభకోణం, డాలర్ల మాయం వంటి వాటికి పాల్పడింది నిజం కాదా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. తిరుమల ఖజానాను దారి మళ్లించి కొల్లగొట్టింది వాస్తవం కాదా? కోవిడ్ సమయంలో స్వామి వారి లడ్డూ ప్రసాదాలను దారి మళ్లించింది నిజం కాదా? కరుణాకర్ రెడ్డి తన కుమార్తె వివాహాన్ని క్రైస్తవ పద్ధతుల్లో జరిపింది నిజం కాదా? అని నిలదీశారు. అలాంటి వ్యక్తి తిరుమల దేవస్థానం గురించి, హిందూ మత ఆచారాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
తిరుమల ప్రతిష్ట కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి అన్నదాన ట్రస్ట్ ప్రారంభించారని, అక్కడ ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అది ఎన్టీఆర్ కృషి వల్లే అని ఆయన అన్నారు.
విగ్రహం తల తీస్తే పట్టించుకున్నారా?
గత ఐదేళ్లు హిందుత్వంపై దాడి జరిగితే జగన్ రెడ్డి ఎప్పుడూ నోరు మెదపలేదని, అంతర్వేది రథం తగలబెట్టినా పట్టించుకోలేదని, రామతీర్థంలో రాములవారి విగ్రహం తలను దుండగులు తీసేస్తే పట్టించుకోలేదని, విజయవాడ అమ్మవారి గుడిలో వెండి సింహాలు దొంగిలిస్తే చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. నేడు తప్పుడు ప్రచారాలతో కులాలు, ప్రాంతాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పాస్టర్ చనిపోతే ఒక మతానికి అంటగట్టాలని చూశారు
భక్తులకు సక్రమంగా సౌకర్యాలు కల్పిస్తూ, భక్తులు ఆనందంగా ఉండేలా చూస్తుంటే, వైసీపీ మూకలు టీటీడీని అల్లరి చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక పాస్టర్ యాక్సిడెంట్‌లో చనిపోతే, మత విద్వేషాలను రెచ్చగొట్టి ఒక మతానికి అంటగట్టాలని చూశారని, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆయన అన్నారు. దీనిపై పాస్టర్ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి పోలీసులపై, ప్రభుత్వంపై నమ్మకం ఉందని చెబితే సైలెంట్ అయ్యారని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో ముస్లింలను రెచ్చగొట్టాలని చూశారని, పార్లమెంటులో అనుకూల ఓటింగ్ వేసి బయటకు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.