Vijayashanti: ఈ అన్నదమ్ముల్దిదరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి: విజయశాంతి

- హైదరాబాదులో అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ప్రీ రిలీజ్ వేడుక
- హాజరైన విజయశాంతి
- ముఖ్య అతిథిగా విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్
- తారక్, కల్యాణ్ రామ్ లపై విజయశాంతి ప్రశంసల జల్లు
విజయశాంతి, కళ్యాణ్ రామ్ నటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులో ఘనంగా జరిగింది. కళ్యాణ్ రామ్‌తో కలిసి ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.
ఈ వేడుకలో విజయశాంతి మాట్లాడుతూ, సీనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో గౌరవమని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అద్భుతంగా నటిస్తారని, సినిమా కోసం ఎంతో కష్టపడతారని ఆమె కొనియాడారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం ఎంతో సహకరించారని, వారిద్దరూ రామలక్ష్మణుల్లా ఉన్నారని ఆమె ప్రశంసించారు. ప్రేక్షకులు వారిని గుండెల్లో పెట్టుకున్నారని, వారు మరిన్ని గొప్ప సినిమాలు చేయాలని, అన్నదమ్ములిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రం ప్రతి తల్లికి, మహిళకు అంకితమని విజయశాంతి పేర్కొన్నారు. అభిమానుల కోరిక మేరకు ఈ సినిమా చేశానని విజయశాంతి తెలిపారు. దర్శకుడు ప్రదీప్ కథ చెప్పినప్పుడు తన పాత్ర నచ్చిందని, కొన్ని సూచనలు చేసిన తర్వాత సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని నమ్మకం కలిగిందని చెప్పారు. ఎడిటర్ తమ్మిరాజు, సెన్సార్ రిపోర్ట్ కూడా సినిమా హిట్ అవుతుందని చెప్పడంతో సంతోషించామన్నారు.
తల్లి తన బిడ్డ మంచి కోసం తపన పడుతుందని, తప్పుదారి పడితే సన్మార్గంలో నడిపిస్తుందని విజయశాంతి అన్నారు. ఈ చిత్రం పూర్తి కమర్షియల్ మూవీ అని, తల్లి కొడుకుల మధ్య పోరాటం, వారి మధ్య సంఘర్షణ చిత్రంలో చూడొచ్చని తెలిపారు. క్లైమాక్స్ కూడా భిన్నంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.