Abhishek Sharma: అభిషేక్ శర్మ సంచలన శతకం... విజయం దిశగా సన్ రైజర్స్

పంజాబ్ కింగ్స్ సాధించిన స్కోరు 245-6... ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ ఫామ్ చూస్తే గెలుపుపై ఏ ఒక్క అభిమానికీ ఆశలు లేవు. కానీ సన్ రైజర్స్ జట్టు తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పరుగుల విధ్వంసం అంటే ఏమిటో ఇవాళ చూపించింది. ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ సంచలన బ్యాటింగ్ ప్రదర్శనతో ఈ సీజన్ లో రెండో సెంచరీ సాధించగా, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ చెయ్యాల్సిన డ్యామేజి చేసిన తర్వాతే పెవిలియన్ కు తిరిగొచ్చాడు.
అభిషేక్ శర్మ 40 బంతుల్లోనే 100 పరుగులు నమోదు చేయడం విశేషం. హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 66 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 12.2 ఓవర్లలో 171 పరుగులు జోడించారు. వీళ్ల ఉతుకుడుకు పంజాబ్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోరు 14 ఓవర్లలో 1 వికెట్ కు 186 పరుగులు. అభిషేక్ శర్మ 108, క్లాసెన్ 2 పరుగులతో ఆడుతున్నారు. సన్ రైజర్స్ విజయానికి ఇంకా 36 బంతుల్లో 60 పరుగులు చేయాలి.