BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి

- ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ
- తొలుత అనుమతి నిరాకరించిన పోలీసులు
- అనుమతి ఇస్తూ తాజాగా కాజీపీట రూరల్ ఏసీపీ ఉత్తర్వులు జారీ
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి లభించింది. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. తొలుత పోలీసులు ఈ సభకు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో విచారణ కొనసాగుతుండగానే పోలీసులు అనుమతి ఇవ్వడంతో, హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బీఆర్ఎస్ నేతలు ఉపసంహరించుకోనున్నారు.
వరంగల్ కమిషనరేట్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ, బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ సీనియర్ నేతలు పెద్ది మదుసూధన్ రెడ్డి, వినయ్ భాస్కర్ అనుమతి పత్రాలను అందుకున్నారు.
రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో తరలి రావాలి
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాల కారణంగా బీఆర్ఎస్ ఆవిర్భవించిందని అన్నారు.
తెలంగాణ కోసం, ప్రజల కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపారని పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని, రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను అందించడంతో పాటు పుష్కలంగా నీటిని ఇచ్చి తెలంగాణను పచ్చగా మార్చారని ఆయన తెలిపారు.