Ashwini Dutt: ఆ ఒక్క మాట చాలు.... నిర్మాత అశ్వనీదత్ గురించి ఎమ్మెల్యే గౌతు శిరీష భావోద్వేగ పోస్టు

TDP MLA Gouthu Sirishas Heartfelt Post About Ashwini Dutt

 


ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అశ్వినీదత్ గురించి రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండే టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష ఓ పోస్టులో ప్రస్తావించడం, అది కూడా ఎంతో ఆమె ఎంతో ఎమోషనల్ గా స్పందించడం తప్పకుండా ఆశ్చర్యపరిచే విషయమే.

 ఇంతకీ ఆమె తన పోస్టులో ఏమని పేర్కొన్నారంటే... 

"వైజయంతి ప్రొడక్షన్స్, అశ్వినీదత్ గారు, ఈ రెండు పేర్లు తెలియని, వినని  తెలుగువారు మరియు సినిమా ప్రియులు ఉండరు. 80, 90వ దశకాల్లో ఆ బ్యానర్ లో నటిస్తే చాలు హిట్ గ్యారంటీ అనుకునే నటులు ఎంతమందో? తరాలు, అభిరుచులు మారినా ఇప్పటికీ అవే విలువలతో సినిమాలు తీస్తూ విజయాలతో ముందుకు వెళ్తున్న సంస్థ, ఈ తరం యువతకి కూడా ఎంతో నచ్చేసిన 'సీతారామం' చిత్రం వైజయంతి వారిదే. 

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే... నాలుగు సంవత్సరాల క్రితం, అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి, ఇప్పటి మాజీ మంత్రి అయిన అప్పలరాజుతో పోరాటం చేస్తున్న సమయంలో ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను అశ్వినీదత్ ను మాట్లాడుతున్నాను అమ్మా అని అవతలి నుంచి వినిపించింది. ఆ స్థాయి వ్యక్తి నాకు ఫోన్ చేస్తారని ఎందుకు ఊహిస్తాను చెప్పండి... అస్సలు నమ్మలేకపోయాను. 

ఒక ఆడపిల్లగా నీ పోరాటం చూస్తున్నాను, గౌతు లచ్చన్న గారి మనుమరాలిగా చాలా కష్టపడుతున్నావు, ఇలాగే ముందుకు వెళ్ళు అని అశ్వనీదత్ గారు ప్రోత్సహించారు. మాట్లాడింది ఆయనేనా అని అస్సలు నమ్మలేకపోయాను. ఎంతగా అంటే... ఆ ఫోన్ కాల్ తర్వాత ఆ నంబర్ మళ్ళీ ట్రూ కాలర్ లో చెక్ చేసేంతగా! 

ఈ 5 సంవత్సరాలలో అప్పుడప్పుడు ఆయన మెసేజెస్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారా... నీ పోరాటాలు చూస్తున్నాను అని ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చేవారు. ఎన్నికల్లో మా శిరీషమ్మని గెలిపించండి అని ఒక వీడియో కూడా నాకు పంపించారు. ఈ రోజు మొదటిసారి కలిశాను, ఆ స్థాయి వ్యక్తి నాకు అపాయింట్మెంట్ ఇవ్వడమే గొప్ప అని నేను అనుకుంటే... ఆయన చూపించిన ఆప్యాయత, అభిమానం, మర్చిపోలేనిది. మా ఇంటి ఆడపిల్ల మా ఇంటికి వచ్చింది అన్న మాట ఒక్కటి చాలు... నేను జీవితాంతం గుర్తుపెట్టుకోడానికి. 

అన్ని మానవ సంబంధాలు ఏదో ఒక అవసరం కోసమే అని అనుకుంటున్న , అనిపిస్తున్న ఈ రోజుల్లో... ఈ రోజు ఆయన మా దంపతులని ఆహ్వానించిన విధానం, ఆయన కుటుంబ సభ్యులకి పరిచయం చేసిన పద్ధతి మర్చిపోలేం. ఏం మాట్లాడినా ఏదో అవసరం కోసమే అనుకునే ఈ రోజుల్లో, అవసరం అక్కరలేని అభిమానం, ఆప్యాయత చూపించే పెద్దలు కూడా ఉన్నారు అని సంతోషం అనిపించించిది. 

మీ హార్దిక స్వాగతానికి, ఆప్యాయంగా ఆహ్వానించినందుకు... ముఖ్యంగా ఎంతగానో నైతిక మద్దతు ఇస్తున్నందుకు థాంక్యూ సర్. ఒక వ్యక్తి గొప్పదనం ఆస్తిపాస్తులు వల్ల కాదు, వ్యక్తిత్వం వల్ల అని మిమ్మల్ని చూస్తే అనిపించింది" అంటూ గౌతు శిరీష వివరించారు. అశ్వినీదత్ ను కలిసినప్పటి ఫొటోలను కూడా ఆమె పంచుకున్నారు. 

Ashwini Dutt
Gouthu Sirisha
TDP MLA
Vijaya Productions
Tollywood Producer
Emotional Post
Telugu Cinema
Political Figure
Seetaraman Movie
Moral Support
  • Loading...

More Telugu News