Chennai Super Kings: చెన్నై ఘోర పరాజయం... చుక్కలు చూపించిన కేకేఆర్

- చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
- తొలుత 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసిన సీఎస్కే
- 10.1 ఓవర్లలోనే కొట్టేసిన కేకేఆర్
- భారీ సిక్సులతో హడలెత్తించిన డికాక్, నరైన్
సొంతగడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘోర పరాజయం ఎదుర్కొంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సీఎస్కే జట్టు కేకేఆర్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. మొదట చెన్నై జట్టును 20 ఓవర్లలో 103-9 స్కోరుకే పరిమితం చేసిన కేకేఆర్... 104 పరుగుల సింపుల్ టార్గెట్ ను 10.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో 2 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది.
క్వింటన్ డికాక్ 23, సునీల్ నరైన్ 44, కెప్టెన్ అజింక్యా రహానే 20 (నాటౌట్), రింకూ సింగ్ 15 (నాటౌట్) పరుగులు చేశారు. తక్కువ స్కోరు అయినప్పటికీ చెన్నైకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తొలి పవర్ ప్లేలోనే 71 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 3 సిక్సులు కొట్టగా... మరో ఓపెనర్ సునీల్ నరైన్ 2 ఫోర్లు, 5 సిక్సులతో బెంబేలెత్తించాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంభోజ్ 1, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు.
ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నై జట్టుకు ఇది ఐదో ఓటమి. కెప్టెన్ మారినా ఆ జట్టు తలరాత మారలేదు. రుతురాజ్ గాయంతో జట్టుకు దూరం కాగా, కెప్టెన్ గా ధోనీ పగ్గాలు చేపట్టినప్పటికీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు సరికదా, మరింత దిగజారిందని తాజా ఓటమి చెబుతోంది.