Sanjay Raut: ముంబై ఉగ్రదాడి సూత్రధారిపై సంజయ్ రౌత్ వ్యాఖ్యలు... ఫడ్నవీస్ కౌంటర్

- తహవ్వుర్ రాణాను ఉరి తీయాలన్న సంజయ్ రౌత్
- బీహార్ ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటారేమోనని విమర్శ
- ఫూల్స్ మాటలకు తాను సమాధానం చెప్పనన్న ఫడ్నవీస్
శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఇచ్చారు. ముంబై ఉగ్రదాడి కేసు ప్రధాన సూత్రధారి తహవ్వుర్ రాణాను వెంటనే ఉరి తీయాలని, బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటారేమోనని సంజయ్ రౌత్ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఫడ్నవీస్ స్పందించారు.
నేను ఫూల్స్ మాటలకు సమాధానం చెప్పనని, వారిని అలాగే మాట్లాడనివ్వండని అన్నారు. ముంబై దాడుల వెనుక ఉన్న ప్రధాన సూత్రధారిని ప్రభుత్వం విజయవంతంగా దేశానికి తీసుకురావడం సంతోషంగా ఉందని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
రాణా మన న్యాయవ్యవస్థ ఎదుట విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఉగ్రదాడి కేసులో అజ్మల్ కసబ్‌ను ఉరితీసినప్పటికీ, కుట్రదారులు పరారీలో ఉండటం బాధించేదని, కానీ ఇప్పుడు అతడిని భారత్‍కు తీసుకువచ్చామని అన్నారు. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.