Faroe Islands: చంద్రుని శక్తితో లోకానికి వెలుగు... చిన్న దీవుల పెద్ద ప్రయత్నం

Faroe Islands Harness Lunar Power for Renewable Energy

 


ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఎక్కడో విసిరేసినట్టు ఉండే అతి చిన్న దీవుల సమాహారమే... ఫారో ఐలాండ్స్. బ్రిటన్ భూభాగానికి కాస్త దగ్గరగా ఉండే ఈ ఫారో దీవులు ఒక అద్భుతమైన అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించాయి. భూమి మీద ఉంటూనే చంద్రుడి అపారమైన శక్తిని ఉపయోగించుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించారు.

చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కారణంగా సముద్రాల్లోని అలలు ఎగసిపడుతుండడం తెలిసిందే. దీని ఆధారంగానే కరెంటు ఉత్పత్తి చేసేందుకు ఫారో ఐలాండ్స్ కీలక ప్రాజెక్టు చేపట్టింది. ప్రముఖ బేరింగ్ తయారీ సంస్థ ఎస్కేఎఫ్ (SKF), సముద్ర శక్తి అభివృద్ధి సంస్థ మినెస్టో (Minesto)తో చేతులు కలిపి, అలల శక్తిని ఉపయోగించడం ద్వారా ఈ కలను సాకారం చేయడానికి ఫారో ఐలాండ్స్ కృషి చేస్తుంది.

సాంప్రదాయ అంతరిక్ష పరిశోధనలకు భిన్నంగా, ఈ కార్యక్రమం అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెడుతుంది. గత సంవత్సరం నుంచి, ఎస్కేఎఫ్, మినెస్టో ఫారో దీవుల సమీపంలోని అట్లాంటిక్ మహాసముద్రంలో అలల గాలిపటాలను ఉపయోగించి అలల శక్తి సేకరణకు తెరలేపాయి. ఈ మిషన్ ఉద్దేశ్యం చంద్రుని శక్తిని అంచనా వేసి, దాన్ని పునరుత్పాదక శక్తి వనరుగా మార్చడం.

లూనా (LUNA) అనే గాలిపటం సముద్ర గర్భంలో ఎగురుతూ నిశ్శబ్దంగా చంద్రుని శక్తిని సేకరిస్తుంది. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నిరంతరాయంగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. నేడు, అనుకూలమైన అలల ప్రవాహాలు ఉన్న కొన్ని దేశాలు మాత్రమే చంద్రుని ద్వారా ఉత్పత్తి చేయబడిన శక్తి యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించడం ప్రారంభించాయి. 

ఇందులో బాగంగా ఒక చంద్రుని శక్తి కేంద్రం ఫారో దీవుల అంతరిక్ష కార్యక్రమానికి పునాదిగా నిలుస్తుంది. ఒక లూనా గాలిపటం 1.2 మెగావాట్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక సంవత్సరానికి 200 గృహాలకు విద్యుత్ను అందించడానికి సరిపోతుంది. తదుపరి లక్ష్యం 200 మెగావాట్ల అలల శక్తి ఉత్పాదన సాధించడం. ఇది 2030 నాటికి, అంచనా వేసిన విద్యుత్ అవసరాలలో 40 శాతం తీర్చగలదు. అంతేకాదు చిన్న, మారుమూల ద్వీప దేశంలోని 50,000 మంది ప్రజలకు అవసరమైన పర్యావరణ హిత విద్యుత్ ను అందిస్తుంది. 

కాగా, ఈ ప్రాజెక్టులో కీలకంగా ఎన్న ఎస్కేఎఫ్ సంస్థకు భారత్ లోనూ కార్యాలయం ఉంది. దీనిపై ఎస్కేఎఫ్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ, మినెస్టోతో తమ ఒప్పందం పునరుత్పాదక విద్యుత్ రంగంలో కీలక ముందడుగు అని అభివర్ణించారు. భారత్ వంటి దేశాలకు అలల శక్తి ఒక మెరుగైన ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. ముఖ్యంగా, భారత్ లోని విస్తారమైన కోస్తా ప్రాంతాలకు ఈ తరహా శక్తి వనరులతో ఎంతో ఉపయుక్తం అని వివరించారు. 

ప్రస్తుతం అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం ప్రపంచ విద్యుత్తులో 80 శాతం శిలాజ ఇంధనాల నుంచి ఉత్పత్తి అవుతోంది. 2050 నాటికి విద్యుత్ ఉత్పత్తిలో సముద్ర శక్తి వాటా  గణనీయమైన స్థాయికి చేరుతుందని అంచనా. ఓషన్ ఎనర్జీ యూరప్ అంచనా ప్రకారం యూరప్ వినియోగించే విద్యుత్తులో 10 శాతం అవసరాలను సముద్ర శక్తి తీర్చగలదని భావిస్తున్నారు. అంతేకాదు... ఈ రంగం 2050 నాటికి 4 లక్షల ఉద్యోగాలను సృష్టించగలదు.

Faroe Islands
Tidal Energy
Ocean Energy
Renewable Energy
Lunar Energy
Minesto
SKF
Sujeth
Sustainable Energy
Green Energy
  • Loading...

More Telugu News