Satyajit Barman: రైల్లో సోషల్ వర్కర్ ను కొట్టి నిర్బంధించిన ఐఆర్‌సీటీసీ సిబ్బంది... కారణం ఇదే!

- గీతాంజలి ఎక్స్ ప్రెస్ లో ఘటన
- ఆహారం తూకం తక్కువగా ఉందన్న ప్రయాణికులు
- ప్రయాణికుల తరఫున ప్రశ్నించేందుకు వెళ్లిన సామాజిక కార్యకర్త బర్మన్
- దౌర్జన్యం చేసిన సిబ్బంది
గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌లో ఆహారం నాణ్యత, ధరలపై ఫిర్యాదు చేసిన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఐఆర్‌సీటీసీ సిబ్బంది ప్రయాణికులపై దాడి చేసి, ఓ సామాజిక కార్యకర్తను గంటకు పైగా నిర్బంధించారని ఆరోపణలు వచ్చాయి. ఆర్‌పీఎఫ్ జోక్యంతో ఆయనకు విముక్తి కలిగింది. సామాజిక కార్యకర్త సత్యజిత్ బర్మన్ ఫిర్యాదు మేరకు ఏడుగురు ఐఆర్‌సీటీసీ ఉద్యోగులపై కేసు నమోదు చేశారు.
అంబర్‌నాథ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సత్యజిత్ బర్మన్ ఏప్రిల్ 6న కోల్‌కతాలో పని ముగించుకుని హౌరా-ముంబై గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బద్నేరా సమీపంలో కొందరు ప్రయాణికులు ప్యాంట్రీ కార్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఐఆర్‌సీటీసీ నిర్ణయించిన బరువు కంటే తక్కువ ఆహారాన్ని అందిస్తున్నారని, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపించారు.
బర్మన్ వారి వద్దకు వెళ్ళి విషయం తెలుసుకున్నారు. సిబ్బంది ఆయనను ప్యాంట్రీ కార్‌లో ఆహారాన్ని తూకం వేసి చూడండి అని చెప్పడంతో, బర్మన్ ప్రయాణికులు మైదుల్ మల్లిక్, ఆషికుల్ హక్, నజ్రుల్ షేక్‌లను వెంటబెట్టుకుని ప్యాంట్రీ కార్‌కు వెళ్లారు. అక్కడ ప్యాంట్రీ కార్ మేనేజర్ బర్మన్‌ను ప్రయాణికులను రెచ్చగొడుతున్నావంటూ దూషించి, అతని ఫోన్ లాక్కుని, కొట్టి, బలవంతంగా కూర్చోబెట్టారు. మిగిలిన సిబ్బంది ప్రయాణికులను బెదిరించి, కొట్టి వారి కంపార్ట్‌మెంట్‌లకు పంపించేశారు.
దీంతో ఒక ప్రయాణికుడు ఆర్‌పీఎఫ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు ప్యాంట్రీ కార్‌కు చేరుకుని బర్మన్‌ను విడిపించి అతని సీటు వద్దకు పంపారు. రైలు కళ్యాణ్ చేరుకున్నాక బర్మన్ కళ్యాణ్ జీఆర్‌పీకి ఫిర్యాదు చేసి ఏడుగురు ఉద్యోగులపై కేసు పెట్టారు. ఈ ఘటన బద్నేరా జీఆర్‌పీ పరిధిలో జరగడంతో కేసును వారికి బదిలీ చేశారు. ఐఆర్‌సీటీసీ కాంట్రాక్టర్లు ప్రయాణికులను ఎలా దోచుకుంటున్నారో ఈ ఘటన చూపిస్తుందని ఓ సామాజిక కార్యకర్త సమీర్ జవేరి అన్నారు. దీనిపై రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.