Nara Lokesh: వచ్చే వారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా పట్టా రిజిస్ట్రేషన్: మంత్రి నారా లోకేశ్

Free Land Registration in Andhra Pradesh Minister Nara Lokeshs Announcement

  • మంగళగిరిలో మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమం
  • ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని వెల్లడి

వచ్చే వారం నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు కూడా వస్తుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మన ఇల్లు-మన లోకేశ్ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు మధ్యాహ్నం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో తాడేపల్లి మహానాడు ప్రాంతానికి చెందిన 430 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. నేడు మొత్తం 1030 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. 

గతంలో ఇంటి పట్టాల కోసం చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోలేదు 

దశాబ్దాల కల అయిన శాశ్వత ఇంటి పట్టాలు అందించాలని ఇక్కడి ప్రజలు కోరారు. ఏడాదిలోగా బట్టలు పెట్టి మొదటి దశ ఇంటి పట్టాలు ఇస్తానని చెప్పా. 11 నెలల్లో హామీని నిలబెట్టుకునేందుకే మీ ముందుకు వచ్చా. గతంలో ఇంటి పట్టాల కోసం చెప్పులరిగేలా తిరిగారు. జిరాక్స్ లకు, అర్జీలకే వేలరూపాయలు ఖర్చు చేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలో యుద్ధప్రాతిపదికన కొలతలు తీశాం. ఆ వివరాలన్నీ వచ్చిన వెంటనే కేబినెట్ లో చర్చించి పాలసీ తీసుకువచ్చాం. 

రెండేళ్లలో ఇంటి పట్టా అమ్ముకునే హక్కు

వచ్చే వారం నుంచి ఇంటి పట్టాను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రెండేళ్లలో పట్టాను అమ్ముకునే హక్కు కూడా మీకు వస్తుంది. దయచేసి ఎవరూ అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతాం. ఇందుకు మీ అందరి సహకారం కావాలి. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. మీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తా.

రెండో కేబినెట్ లో మీటింగ్ లోనే అది క్లియర్

మంగళగిరి ప్రజల దశాబ్దాల కల వంద పడకల ఆసుపత్రి. రెండో కేబినెట్ మీటింగ్ లోనే ఇది క్లియర్ అయింది. ఈ నెల 13వ తేదీన ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఏడాదిలోగా పూర్తి చేస్తాం. భూగర్భ డ్రైనేజీ, భూగర్భ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, భూగర్భ కరెంట్ అందిస్తాం. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. పార్క్ లు, చెరువులు అభివృద్ధి చేస్తాం. పిల్లలు ఆడుకునేందుకు క్రికెట్ టర్ఫ్ లు, బాస్కెట్ బాల్ కోర్టులు ఏర్పాటు చేస్తాం... అని లోకేశ్ వివరించారు.


Nara Lokesh
Free Land Registration
AP Land Registration
Mangalagiri Development
Affordable Housing
Land Ownership Rights
Andhra Pradesh Politics
Government Schemes
Housing Schemes
  • Loading...

More Telugu News