YS Sharmila: వదిన భారతి రెడ్డిపై కిరణ్ చేసిన వ్యాఖ్యల పట్ల షర్మిల ఏమన్నారంటే...!

- వైఎస్ భారతిపై ఐ-టీడీపీ కార్యకర్త కిరణ్ అనుచిత వ్యాఖ్యలు
- ఇలాంటి సైకో గాళ్లను నడిరోడ్డుపై ఉరితీయాలన్న షర్మిల
- ఇటువంటి నీచపు వ్యాఖ్యలు తీవ్రవాదంతో సమానం అని ఆగ్రహం
వైసీపీ అధినేత జగన్ అర్ధాంగి వైఎస్ భారతి రెడ్డిపై ఐ-టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అసభ్యకర వ్యాఖ్యల పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు.
భారతి రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి నీచపు వ్యాఖ్యలు తీవ్రవాదంతో సమానం... ఈ సైకో గాళ్లను నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు అంటూ నిప్పులు చెరిగారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ప్రోత్సహించే యూట్యూబ్ చానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని షర్మిల స్పష్టం చేశారు.
"కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదు. ఏ పార్టీకి చెందిన వాళ్లయినా, వాళ్లు ఎంతటి వాళ్లయినా శిక్ష పడాల్సిందే. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీలే. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు... రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదికి లాగారు... మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారు... అన్యం పున్యం ఎరుగని పసిపిల్లలను సైతం లాగారు... అక్రమ సంబంధాలు అంటగట్టారు.
మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టుపట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి" అని షర్మిల పేర్కొన్నారు.