Gorantla Madhav: నారా లోకేశ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు... గోరంట్ల మాధవ్ పై మరో కేసు నమోదు

- గోరంట్ల మాధవ్ పై రెండు కేసులు నమోదు
- చేబ్రోలు కిరణ్ పై దాడి చేసిన వ్యవహారంలో తొలి కేసు నమోదు
- లోకేశ్ పై అక్కా, బావా వ్యాఖ్యలపై మరో కేసు నమోదు
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు వరుస షాక్ లు తగిలాయి. ఒక రోజు వ్యవధిలోనే గోరంట్ల మాధవ్ పై రెండు కేసులు నమోదయ్యాయి. మాజీ సీఎం జగన్ భార్య భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళుతుండగా పోలీసు వాహనాలను వెంబడించి మాధవ్ రచ్చ చేశారు. పోలీసుల వాహనాలను ఆపి కిరణ్ పై దాడి చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మాధవ్ పోలీసుల అదుపులోనే ఉన్నారు.
మరోవైపు, నిన్న తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ కు పోలీసులు సరైన భద్రత కల్పించడం లేదని మండిపడ్డారు. ఆడవాళ్లకు అక్కా కాని, మగవాళ్లకు బావా కాని నారా లోకేశ్ కు మాత్రం జడ్ కేటగిరీ భద్రతను కల్పించి సీఆర్సీఎఫ్ బలగాలను కేటాయించారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
లోకేశ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ తాడేపల్లికి చెందిన టీడీపీ నేత జి.నాగేశ్వరరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మాధవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.