TTD: గోశాలలో గోవుల మృతిపై వదంతులు.. టీటీడీ కీలక ప్రకటన

- టీటీడీ గోశాలలో గోవులు మృతిచెందాయని వదంతులు
- బయటకు తెలియకుండా దాచిపెట్టారంటూ ప్రచారం
- ఇలాంటి వదంతులను నమ్మొద్దంటూ టీటీడీ ప్రకటన
- మృతిచెందిన ఆవుల ఫొటోలు టీటీడీ గోశాలకు చెందినవి కావని స్పష్టీకరణ
టీటీడీ గోశాలలో గోవులు మృతిచెందాయని, బయటకు తెలియకుండా దాచిపెట్టారంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ అధికారులు ఖండించారు. కొంతమంది సోషల్ మీడియాలో కావాలనే వదంతులు సృష్టిస్తున్నారని టీటీడీ ప్రకటించింది. మృతిచెందిన ఆవుల ఫొటోలు టీటీడీ గోశాలకు చెందినవి కావని స్పష్టం చేసింది.
కొందరు కావాలనే వేరే ఎక్కడో చనిపోయిన గోవుల ఫొటోలను టీటీడీ గోశాలకు చెందిన గోవులంటూ ప్రచారం చేస్తున్నారని టీటీడీ తెలిపింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని ఈ సందర్భంగా టీడీటీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వదంతులను నమ్మొద్దని కోరింది. ఈ మేరకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా, టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలోని శ్రీవారి గోశాలలో గత 3 నెలల్లో 100కి పైగా గోవులు మృతిచెందాయని, ఈ విషయాన్ని దాచిపెట్టారని ఆరోపించారు. అత్యంత పవిత్రంగా కొనసాగుతున్న టీటీడీ గోశాలలో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా తయారయిందని మండిపడ్డారు.
తమ హయాంలో దాతల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 550 గోవులను తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ ఆవులు ఇచ్చే 15 వేల లీటర్ల పాలను నిత్యం స్వామివారి అన్నప్రసాదం కోసం వినియోగించామని తెలిపారు. కానీ, ఇప్పుడు ఆ గోవులకు పుట్టిన దూడలు, ఇతర ఆవుల పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. తిరుమల పవిత్రతను కాపాడతామని, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని చెప్పిన వాళ్లంతా ఇప్పుడు ఏమయ్యారు? అని భూమన నిలదీశారు.