South Central Railway: వేసవి సెలవులు.. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు

- వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని 24 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
- ఏప్రిల్ 11 నుంచి జూన్ 27వ తేదీ వరకు చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు రైలు
- ఏప్రిల్ 12 నుంచి జూన్ 28వ తేదీ వరకు శ్రీకాకుళం రోడ్డు - చర్లపల్లి వరకు రైలు
వేసవి సెలవులను పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ మార్గంలో 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి జూన్ 27వ తేదీ వరకు ప్రతి శుక్రవారం చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్డు రైలు నడుస్తుండగా, ఎల్లుండి నుంచి జూన్ 28వ తేదీ వరకు ప్రతి శనివారం శ్రీకాకుళం రోడ్డు - చర్లపల్లి మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తాయి.
నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్‌లలో రైళ్లు ఆగుతాయి. అయితే, చర్లపల్లి స్టేషన్ నుంచి, అలాగే శ్రీకాకుళం రోడ్డు నుంచి ఏ సమయంలో బయలుదేరుతాయనే వివరాలను మాత్రం రైల్వే శాఖ ప్రకటనలో వెల్లడించలేదు.