Dayan Krishnan: భారత్‌కు తహవ్వుర్ అప్పగింత.. కేసులో కీలకంగా మారిన దయాన్ కృష్ణన్ ఎవరు?

- రాణాను భారత్‌కు రప్పించడంలో దయాన్ కృష్ణన్ కీలక పాత్ర
- 2010 నుంచి ముంబై దాడుల కేసును వాదిస్తున్న దయాన్ కృష్ణన్
- దయాన్ వాదనలతో ఏకీభవిస్తూ రెండేళ్ల క్రితం అమెరికా కోర్టు తీర్పు
- ఈ తీర్పును సమర్థించిన అమెరికా అత్యున్నత న్యాయస్థానం
ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు తహవ్వుర్ రాణాను అమెరికా నుండి విజయవంతంగా భారత్‌కు తీసుకురావడంలో సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం దయాన్ కృష్ణన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. అమెరికా న్యాయస్థానంలో భారత ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించి తహవ్వుర్‌ను మన దేశానికి రప్పించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో తహవ్వుర్‌పై జరగనున్న విచారణలో కూడా దయాన్ కృష్ణన్ ఎన్ఐఏ తరఫున వాదనలు వినిపించనున్నారు.
సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ దేశంలో పేరొందిన క్రిమినల్ లాయర్లలో ఒకరుగా ఉన్నారు. నేషనల్ లా స్కూల్ నుంచి 1993లో పట్టా పొందిన ఆయన 1999 నుంచి స్వతహాగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2001లో పార్లమెంటుపై ఉగ్రదాడి, కావేరీ జల వివాదం వంటి కేసుల్లో వాదించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2012లో సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కూడా వ్యవహరించారు.
2010 నుంచి ఆయన ముంబై దాడి కేసును వాదిస్తున్నారు. హెడ్లీ, తహవ్వుర్ రాణాలను అమెరికా నుంచి భారత్‌కు అప్పగించే కేసులకు ఆయన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు. 2014లో ఆయన ఈ కేసుల కోసం నియమితులయ్యారు. తహవ్వుర్ అప్పగింతకు సంబంధించి రెండేళ్ల క్రితం అమెరికా న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చాలా కీలకంగా మారింది. దయాన్ కృష్ణన్ చేసిన వాదనలతో ఏకీభవిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అప్పగింత విషయంలో ఈ కేసు ఒక కీలక మలుపు తిరిగింది. ఈ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.