Mark Shankar: అంజనేయస్వామి కృపతో మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశాడు: చిరంజీవి

- ఇంకా కోలుకోవాల్సి ఉందన్న చిరంజీవి
- రేపు హనుమాన్ జయంతి... ఆ స్వామి పసిబిడ్డను పెద్ద ప్రమాదం నుండి కాపాడాడన్న మెగాస్టార్
- మార్క్ శంకర్ కోసం ప్రతి ఒక్కరు పూజలు చేస్తున్నారంటూ ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇంటికి చేరుకున్నాడని మెగాస్టార్ చిరంజీవి 'ఎక్స్' వేదికగా తెలియజేశారు. "మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశాడు. అయితే, ఇంకా కోలుకోవాల్సి ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
తమ కులదైవమైన ఆంజనేయస్వామి దయ, కృపతో మార్క్ శంకర్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మునుపటిలా ఉంటాడని ఆకాంక్షించారు.
రేపు హనుమాన్ జయంతి అని చిరంజీవి గుర్తు చేశారు. ఆ స్వామి తమ పసిబిడ్డను ఒక పెద్ద ప్రమాదం నుంచి, విషాదం నుంచి కాపాడి తమకు అండగా నిలిచారని ఆయన అన్నారు.
మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో, తమ తమ ప్రాంతాల్లో ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేసి, ఆశీస్సులు అందజేస్తూ తమకు అండగా నిలుస్తున్నారని రాసుకొచ్చారు. వారందరికీ తన తరఫున, పవన్ కల్యాణ్ తరఫున, తమ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.