Tahawwur Rana: ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవ్వుర్ అప్పగింతపై స్పందించిన కాంగ్రెస్

- నిందితుడి అప్పగింత విషయంలో ఎన్డీయే ప్రభుత్వం చేసిందేమీ లేదన్న చిదంబరం
- అప్పగింత ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించలేదన్న చిదంబరం
- మోదీ ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవాలని చూస్తోందని వ్యాఖ్య
ముంబై ఉగ్రవాద దాడి కేసులో కీలక సూత్రధారి తహవ్వుర్ రాణా అప్పగింతపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. నిందితుడి అప్పగింత విషయంలో ఎన్డీయే ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం అన్నారు. యూపీఏ హయాంలో ప్రారంభించిన వ్యూహాత్మక దౌత్య ప్రయోజనాలను ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం పొందుతోందని పేర్కొన్నారు. తహవ్వుర్ అప్పగింత ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించలేదని స్పష్టం చేశారు.
తహవ్వుర్ రాణా అప్పగింత ఎన్డీయే గొప్పతనమేమీ కాదని, కానీ మోదీ ప్రభుత్వం మాత్రం క్రెడిట్ తీసుకోవాలని చూస్తోందని విమర్శించారు. యూపీఏ హయాంలో నిందితుడి అప్పగింతపై అమెరికాతో చర్చలు జరిపినట్లు చెప్పారు. దాదాపు దశాబ్దానికి పైగా శ్రమించామని అన్నారు. నిందితుడిపై యూపీఏ హయాంలో నిఘా కూడా పెట్టినట్లు తెలిపారు. యూపీఏ ప్రభుత్వ విదేశాంగ విధానం వల్లే అప్పగింత సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
2011లో అతడిని అమెరికా కోర్టు నిర్దోషిగా విడుదల చేసినప్పుడు, కాంగ్రెస్ బహిరంగంగా నిరసన వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఇతర ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆ తర్వాత అమెరికా కోర్టు అతడికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించిందని అన్నారు. అతని అప్పగింతకు దౌత్యపరమైన ఒత్తిడిని పెంచినట్లు వెల్లడించారు.