Nitish Kumar: నితీశ్ కుమార్‌ను ఉపప్రధానిగా చూడాలనుకుంటున్నాను: కేంద్ర మాజీ మంత్రి

- ఎన్డీయేకు నితీశ్ చేసిన సేవలు వెలకట్టలేనివన్న అశ్విని కుమార్ చౌబే
- సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్య
- ఆయన సేవలను గుర్తించి పదవి ఇవ్వాలని వ్యాఖ్య
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అశ్వినీ కుమార్ చౌబే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ఉప ప్రధానిగా చూడాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్డీయేకు నితీశ్ కుమార్ చేసిన సేవలు వెలకట్టలేనివని, సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించి ఉప ప్రధాని పదవిని ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, ఒకవేళ అదే జరిగితే బీహార్ రాష్ట్రం నుంచి ఆ పదవికి వెళ్లిన రెండో వ్యక్తి నితీశ్ అవుతారని తెలిపారు.
ఈ ఏడాది చివరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నితీశ్ కుమార్ మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం అవసరమైతే మరోసారి కూటమి మారేందుకు ప్రయత్నాలు చేయవచ్చునని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ కూడా ఆయనను గౌరవంగా పక్కకు పెట్టాలని భావిస్తోందని సమాచారం. నితీశ్ కుమార్‌ను మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ సిద్ధంగా లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో బీజేపీ నేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.