Virat Kohli: ఐపీఎల్‌లో అరుదైన రికార్డు ముంగిట కోహ్లీ... మరో రెండు బౌండరీలు బాదితే చరిత్రే!

- మరో 2 బౌండరీలు బాదితే ఐపీఎల్‌లో 1,000 బౌండరీలు కొట్టిన తొలి ఆటగాడిగా కోహ్లీ
- ఇప్పటివరకు 265 మ్యాచుల్లో 278 సిక్సర్లు, 720 ఫోర్లు బాదిన రన్ మెషీన్
- కోహ్లీ తర్వాతి స్థానంలో ధావన్ (920), వార్నర్ (899), రోహిత్ (885)
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు ముంగిట ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. మరో రెండు బౌండరీలు బాదితే ఐపీఎల్‌లో 1,000 బౌండరీలు కొట్టిన తొలి ఆటగాడిగా అవతరిస్తాడు.
రన్ మెషీన్ ఇప్పటివరకు 265 మ్యాచుల్లో 278 సిక్సర్లు, 720 ఫోర్లు బాదాడు. మొత్తంగా 998 బౌండరీలు కొట్టాడు. మరో రెండు బౌండరీలు బాదితే వెయ్యి పూర్తవుతాయి. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగే మ్యాచ్‌లోనే విరాట్ ఈ ఫీట్ సాధిస్తాడా? లేదా? అనేది మరి కాసేపట్లో తేలిపోతుంది. ఇక ఈ జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్ (920), డేవిడ్ వార్నర్ (899), రోహిత్ శర్మ (885), క్రిస్ గేల్ (761) ఉన్నారు.
కాగా, ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో 54.66 సగటు, 143.85 స్ట్రైక్ రేట్‌తో 164 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.