Kalvakuntla Kavitha: జగన్ మంచి ఫైటర్... ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

- తాజాగా ఓ ఇంగ్లిష్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కవిత
- దేశ రాజకీయాలు, గులాబీ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఏపీ రాజకీయాల ప్రస్తావన
- ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మంచి పోరాటం చేస్తున్నారని కితాబు
- జగన్మోహన్ రెడ్డి 2.0 తనకు బాగా నచ్చుతుందంటూ వ్యాఖ్య
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా ఓ ఇంగ్లిష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలు, ప్రస్తుతం గులాబీ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, అటు ఏపీ రాజకీయాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం ఏపీలో జగన్ మంచి పోరాటం చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయన్నారు. జగన్ అంటే తనకు ఎంతో ఇష్టమన్న కవిత... ఆయన మంచి ఫైటర్ అని కితాబిచ్చారు. జగన్మోహన్ రెడ్డి 2.0 తనకు బాగా నచ్చుతుందన్నారు. జగన్ తన రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారని, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మంచిగా ఫైట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన దురదృష్టవశాత్తూ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఏపీలో వైసీపీతో మినహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. పవన్ నిజానికి సీరియస్ రాజకీయ నాయకుడు కాదని, ఆయన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఆయన చేసే ప్రకటనల్లో ఒకదానికొకటి పొంతన ఉండదని దుయ్యబట్టారు.