Karumuri Nageswara Rao: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదు

- కూటమి నేతలను నరుకుతామంటూ కారుమూరి తీవ్ర వ్యాఖ్యలు
- నగరపాలెం పీఎస్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
- విచారణకు రావాలని నోటీసులు ఇస్తామన్న పోలీసులు
మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు పై పోలీసు కేసు నమోదయింది. ఇటీవల ఏలూరులో నిర్వహించిన వైసీపీ సమావేశంలో కారుమూరి మాట్లాడుతూ... కూటమి నేతలను నరుకుతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పెద్దిరెడ్డి దగ్గరకు వెళ్లానని... కూటమి ప్రభుత్వం ఏం చేసినా కూడా దాన్ని దాటి ప్రజలు వైసీపీకి ఓటు వేస్తారని చెప్పానని తెలిపారు. తమపై కక్ష పెట్టుకోవద్దని టీడీపీ నాయకులు కూడా అడుగుతున్నారని... అది మాత్రం జరగదని... గుంటూరు ఇవతల వాళ్లను ఇంట్లో నుంచి లాగి కొడతామని... గుంటూరు అవతలి వాళ్లను నరికిపారేస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కారూమూరి వ్యాఖ్యలపై గుంటూరులోని టీడీపీ నేతలు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మ్యానీ, అడకా శ్రీను ఫిర్యాదు చేశారు. నగరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని కారుమురికి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.