Chebrolu Kiran: జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్

- టీడీపీ అధిష్ఠానం ఆదేశాలతో కిరణ్ పై పోలీసులకు ఫిర్యాదు
- లొకేషన్ ఆధారంగా ఇబ్రహీంపట్నంలో కిరణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదన్న కిరణ్
వైసీపీ అధినేత జగన్ భార్య వైఎస్ భారతిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ పై టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది. దీంతో, కిరణ్ పై టీడీపీ నేతలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల గుడ్డలు ఊడదీస్తానంటూ రామగిరి పర్యటన సందర్భంగా జగన్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, భారతి గురించి చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించమని కోరుతున్నానని అన్నారు. ఎలాంటి దురుద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని... క్షణికావేశంలో మాత్రమే చేశానని చెప్పారు.