Kangana Ranaut: తన ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చిందన్న కంగన... ఆమె వ్యాఖ్యలు అబద్దమంటూ తిప్పికొట్టిన విద్యుత్ బోర్డు!

- మనాలీలో ఉన్న తన ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చిందన్న ఎంపీ
- ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
- ఈ విషయంపై తాజాగా స్పందించిన హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ బోర్డు
- కంగన గత కొన్ని నెలలుగా కరెంట్ బిల్లులు కట్టడం లేదని వెల్లడి
- దాంతో పాత బకాయిలకు కొత్త బిల్లు జత అయ్యి రూ. 91వేలు వచ్చిందన్న బోర్డు
మనాలీలో ఉన్న తన ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చిందని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో తాను ఆ ఇంట్లో కూడా ఉండటం లేదన్నారు. దాంతో ఆ బిల్లు చూసి షాకయ్యానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఇలాంటి పరిస్థితులు సిగ్గుచేటని కాంగ్రెస్ సర్కార్‌ను దుయ్యబట్టారు.
అయితే, ఈ విషయంపై హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ బోర్డు తాజాగా స్పందించింది. కంగన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమంటూ తిప్పికొట్టింది. హెచ్‌పీఎస్ఈబీఎల్ ఎండీ సందీప్ కుమార్ మాట్లాడుతూ... ఎంపీ చెప్పినట్లు ఆమె కరెంట్ బిల్లు రూ.లక్ష దాటలేదన్నారు. దాదాపు రూ. 91,000 వరకు ఉందని తెలిపారు. అది కూడా కంగన గత కొన్ని నెలలుగా కరెంట్ బిల్లులు కట్టకపోవడంతో... పాత బకాయిలకు కొత్త బిల్లు జత అయ్యి అలా చూపించిందని చెప్పారు.
ఆఖరిగా ఆమె జనవరిలో విద్యుత్ బిల్లు కట్టారని ఎండీ తెలిపారు. ఆ తర్వాత కరెంట్ బిల్లు చెల్లించకపోవడంతో ఫిబ్రవరి, మార్చి నెల బిల్లులు కలిసి అలా చూపించిదని ఆయన వెల్లడించారు. ఒక మార్చిలోనే కంగన ఇంటి కరెంట్ బిల్లు రూ. 55,000 వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కంగన ఇంటి కరెంట్ బిల్లు తాలూకు రషీదులను కూడా సందీప్ కుమార్ మీడియాకు చూపించారు.