Revanth Reddy: వాటిని చూసినప్పుడు చంద్రబాబునాయుడు గుర్తుకు వస్తారు: రేవంత్ రెడ్డి

- రూ. 2కే బియ్యం అంటే ఎన్టీఆర్, రైతు బాంధవుడు అంటే వైఎస్సార్ గుర్తుకు వస్తారన్న సీఎం
- అలాగే యంగ్ ఇండియా తన బ్రాండ్ అన్న రేవంత్ రెడ్డి
- పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ ముఖ్యమైందన్న రేవంత్ రెడ్డి
ఐటీ కంపెనీలు, హైటెక్ సిటీని చూసినప్పుడు నారా చంద్రబాబునాయుడు గుర్తుకు వస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మొట్టమొదటిసారి రూ. 2కే ఎన్టీఆర్ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని, దానిని తీసుకున్న ప్రతి పేదవాడు ఆయనను గుర్తు చేసుకుంటారని అన్నారు. జలయజ్ఞం, రైతుబాంధవుడుగా వైఎస్సార్ ప్రజల మదిలో నిలిచిపోతారని అన్నారు. తన బ్రాండ్ యంగ్ ఇండియా అని ఆయన స్పష్టం చేశారు.
విశ్లేషకులు, విమర్శకులు, ప్రజలకు తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని, యంగ్ ఇండియానే తన బ్రాండ్ అని ఆయన అన్నారు. ఎలాంటి బ్రాండ్ లేకుండా, గుర్తింపు లేని ముఖ్యమంత్రిగా ఉంటారా అని కొందరు తనను ప్రశ్నిస్తున్నారని, దానికి సమాధానంగా యంగ్ ఇండియా తన బ్రాండ్ అని చెబుతున్నానని అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆయన యంగ్ ఇండియా పోలీసు స్కూల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసులకు యంగ్ ఇండియా స్కూల్ ఎంతో ముఖ్యమైనదని అన్నారు. పోలీసు శాఖపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని అన్నారు. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని హామీ ఇచ్చారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూలుకు రూ. 100 కోట్లతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిధుల విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.