Sai Sudharsan: సాయి సుదర్శన్ సంచలనం... ఐపీఎల్‌లో రికార్డులు తిర‌గ‌రాసిన యువ కెరటం!

Sai Sudharsan Young sensation creates IPL history

  • నిన్న రాజ‌స్థాన్‌తో మ్యాచ్‌లో అద‌ర‌గొట్టిన యువ ఆట‌గాడు
  • కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు బాదిన సుద‌ర్శ‌న్‌
  • ఐపీఎల్‌లో 30 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక ర‌న్స్ (1,307) చేసిన రెండో ఆటగాడిగా రికార్డు
  • షాన్ మార్ష్ (1,338) మాత్రమే అతనికంటే ముందున్న వైనం
  • ఒకే వేదిక‌పై వరుసగా ఐదుసార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఏకైక భారతీయ ప్లేయ‌ర్‌గా మ‌రో రికార్డు

ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) యువ ఆటగాడు సాయి సుదర్శన్ అద‌ర‌గొడుతున్నాడు. నిన్న రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్ఆర్‌)తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సుదర్శన్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ యువ సంచ‌ల‌నం కేవలం 53 బంతుల్లో 82 పరుగులు బాదాడు. అత‌ని భారీ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 

గుజరాత్‌ 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేయడంలో సాయి సుద‌ర్శ‌న్ కీల‌క‌ పాత్ర పోషించాడు. ఇక ఈ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ద్వారా అత‌డు ఐపీఎల్‌ చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో 30 ఇన్నింగ్స్‌ల తర్వాత 1,307 ర‌న్స్‌ చేసి రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 

షాన్ మార్ష్ (1,338) మాత్రమే అతనికంటే ముందున్నాడు. క్రిస్ గేల్ (1,141), కేన్ విలియమ్సన్ (1,096), మాథ్యూ హేడెన్ (1,082) వంటి దిగ్గజాలు సుద‌ర్శ‌న్ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతేగాక ఐపీఎల్‌లో ఒకే వేదిక‌పై వరుసగా ఐదుసార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఏకైక భారతీయ ఆట‌గాడు కూడా సుదర్శనే.

మ్యాచ్ అనంతరం సాయి సుదర్శన్‌ మాట్లాడుతూ... "మొదట్లో పిచ్‌పై బంతి స్వింగ్‌ అయింది. జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కాస్త కష్టంగా అనిపించింది. కానీ, తర్వాత పిచ్‌ను అర్థం చేసుకున్నాం. దానికి తగ్గట్టుగా బ్యాటింగ్‌ చేశాం. అసలు మా లక్ష్యం మరో 15 పరుగులు చేయాలనే ఉండేది. అయినా మేం మంచిగానే పరుగులు చేశాం అని చెప్పాడు.


Sai Sudharsan
Gujarat Titans
IPL 2023
IPL Records
Indian Cricketer
Young Sensation
Cricket
Rajasthan Royals
Fastest Runs
Top Scorers
  • Loading...

More Telugu News