BRS leader: బీఆర్ఎస్ నేత షకీల్ అరెస్ట్

- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి..
- కొంతకాలంగా దుబాయ్ లోనే ఉంటున్న షకీల్
- రోడ్డు ప్రమాదం కేసు నుంచి కొడుకును తప్పించేందుకు ప్లాన్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆయనను విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఓ రోడ్డు ప్రమాదం కేసు నుంచి తన కుమారుడిని తప్పించే ప్రయత్నం చేసినందుకు షకీల్ పై పోలీసులు గతంలోనే వారెంట్ జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న షకీల్ దుబాయ్ వెళ్లిపోయి కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. షకీల్ భారత్ కు వస్తున్నారనే సమాచారంతో అప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
2023లో షకీల్ కుమారుడు రహేల్ వేగంగా కారు నడుపుతూ ప్రగతి భవన్ ముందు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయగా.. తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ పోలీసులను తప్పుదోవ పట్టించారు. వెంటనే కొడుకును దుబాయ్ పంపించేశారు. కొడుకును తప్పించేందుకు, దుబాయ్ పారిపోయేందుకు షకీల్ సహకరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో షకీల్ పైనా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం తెలిసి షకీల్ కూడా దుబాయ్ పారిపోయారు. గత కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ కు పోలీసులు అనుమతిచ్చారని, పోలీసుల సమక్షంలో ఆయన అంత్యక్రియలకు హాజరవుతారని సమాచారం. అంత్యక్రియలు పూర్తయ్యాక షకీల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించనున్నట్లు తెలిసింది.