'డీజే టిల్లు' .. 'టిల్లు స్క్వేర్' చిత్రాలతో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా సిద్ధు నటించిన చిత్రం 'జాక్‌'. 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో 'బేబి' ఫేమ్‌ వైష్ణవి చైతన్య కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. ట్రైలర్‌లో సిద్ధు మార్క్‌  డైలాగ్‌లు ఉండటంతో ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం, కంటెంట్ పరంగా ఎలా ఉంది? సిద్ధు మరోసారి మేజిక్ చేశాడా? అనేది చూద్దాం. 

కథ: 'జాక్‌' (సిద్ధు జొన్నలగడ్డ) 'రా'లో స్పై ఏజెంట్‌గా చేరాలనేది అతని కోరిక. ఉద్యోగం వచ్చే వరకు నా దేశానికి సేవ చేయకుండా నేను ఎందుకు ఆగాలి? నా దేశాన్ని నేను కాపాడుకుంటా అంటూ హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ముఖ్య నగరాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడే ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇందులో భాగంగా అనుకోకుండా 'రా' ఏజెంట్‌ మనోజ్‌ (ప్రకాశ్ రాజ్‌)ను కూడా 'జాక్' అదుపులోకి తీసుకుంటాడు. ఇక జాక్‌ ఏం చేస్తున్నాడు?ఏ జాబ్‌ చేస్తున్నాడు? తెలుసుకోవడానికి అతని తండ్రి ఓ డిటెక్టివ్‌ను నియమిస్తాడు. ఆ డిటెక్టివ్‌ కూతురు (వైష్ణవి) జాక్‌ను ఫాలో అవుతూ ఉంటుంది. ఆమె వలన జాక్‌ అనుకోకుండా కొన్ని చిక్కుల్లో పడతాడు? అప్పుడతను ఏం చేస్తాడు? వైష్ణవితో ఆయన ప్రేమ ఎలా చిగురించింది? జాక్‌కు స్పై ఏజెంట్‌గా జాబ్‌ వచ్చిందా లేదా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: కొత్తదనం లేని ఓ రొటిన్‌ కథతో దర్శకుడు 'బొమ్మరిల్లు' భాస్కర్‌ ఈ కథను రాసుకోవడంతో, ఈ కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమనే విషయం సినిమా మొదలైన పది నిమిషాల్లోనే తెలిసిపోయింది. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో వాడిన ఉగ్రవాదం, స్పై ఏజెంట్‌ నేపథ్యంతో ఈ కథను అల్లు కోవడమే ఈ చిత్రానికి అతి పెద్ద మైనస్‌. సిద్దు జొన్నలగడ్డ పాత్రను కూడా దర్శకుడు ఆకట్టుకునే విధంగా డిజైన్‌ చేయలేకపోయాడు. 

తన మునుపటి చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాందించుకున్న సిద్ధుతో ఇలాంటి కథను ఎంచుకోవడమే పొరపాటు. సిద్ధుకు యూత్‌లో ఉన్న క్రేజ్‌ ఈ కథకు అసలు ఎక్కడా పోలిక ఉండదు. ప్రతి సన్నివేశం ఎంతో బలహీనంగా, నిరాశగా ఉంటుంది. ఫస్ట్‌హాఫ్‌ స్లోగా, సహనానికి పరీక్షలా ఉంటే సెకండాఫ్‌ కూడా అదే రితీలో దానికి మించిన నీరసంతో కొనసాగింది. బొమ్మరిల్లు భాస్కర్‌ లాంటి దర్శకుడు సిద్దుతో సినిమా అనగానే ఖచ్చితంగా ఓ విభిన్నమైన కథను, అంతకు మించిన స్క్రీన్‌ప్లేను ఆశిస్తారు ప్రేక్షకులు. అయితే ఇవేమీ వాళ్లు పట్టించుకోలేదు. ఓ రొటిన్‌ కథతో  ఓ సినిమా తీసేసి ప్రేక్షకుల ఓపికను పరీక్షించారు. 

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో వచ్చిన క్రేజ్‌ను కొనసాగించే కథలను కాకుండా సిద్దు ఇలాంటి కథలతో వస్తే అతని కెరీర్‌కు ఖచ్చితంగా మైనస్‌గా మారే అవకాశం ఉంది. బొమ్మరిల్లు లాంటి చిత్రాన్ని అందించిన భాస్కర్‌ అసలు ఏ మాత్రం కొత్తదనం లేని నాసిరకమైన కథతో రావడం అందర్ని ఆశ్చర్యపరిచింది. హడావుడిగా సినిమాలు చేయడం కంటే క్వాలిటిగా, కంటెంట్‌ ఉన్న సినిమాలు చేయడమనేది ముఖ్యం. అటు హీరో, ఇటు దర్శకుడు ప్రేక్షకులు తమ మీద పెట్టుకున్న అంచనాలను పట్టించుకోకుండా, కథే లేని ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం సాహసమనే చెప్పాలి. 

పనితీరు: సిద్దు జొన్నల గడ్డ తన పాత్రలో ఎనర్జీగా కనిపించినా, క్యారెక్టరైజేషన్‌ డిజైన్‌లో లోపం ఉండటం వల్ల తన శక్తి మేరకు సినిమాను ముందుకు నడిపించే ప్రయత్నం కనిపించింది. వైష్ణవి చైతన్య పాత్రలో పర్‌ఫార్మెన్స్‌కు పెద్దగా స్కోప్‌ లేదు. ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేదు. విజయ్‌ కె.చక్రవర్తి కెమెరా వర్క్‌, సామ్‌ సీఎస్‌ బీజీఎం సినిమాకు ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. 

అయితే అసలైన కథలో మ్యాటర్‌ లేకుండా మిగతా టెక్నిషియన్స్‌ తమ ప్రతిభను చూపినా అది బూడిదలో పోసిన పన్నీరే.. సో.. సిద్ధు జొన్నలగడ్డ తన బలంగా భావించే ఎంటర్‌టైన్‌మెంట్‌ జోనర్‌ను విస్మరించి, సాదాసీదా కథతో 'బొమ్మరిల్లు' భాస్కర్‌తో చేసిన ఈ 'జాక్‌' ఆపరేషన్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదేమోనని అనిపిస్తుంది.