Donald Trump: దిగ్గజ సంస్థలకు ట్రంప్ కీలక సందేశం

- దిగ్గజ సంస్థలు అమెరికాలో తమ కంపెనీలు పెట్టాలన్న డొనాల్డ్ ట్రంప్
- జీరో టారిఫ్‌లు, తక్షణ విద్యుత్ అనుమతులు, పర్యావరణ అనుమతుల్లో ఎటువంటి అలస్యం ఉండదని వెల్లడి
- వేగవంతంగా అనుమతులు జారీ చేస్తామని ట్రంప్ హామీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్గజ కంపెనీలకు కీలక ఆఫర్ ఇచ్చారు. ట్రంప్ విధిస్తున్న సుంకాలతో ప్రపంచ దేశాలు తీవ్రంగా కలవరపడుతున్నాయి. అయితే చైనా, కెనడా వంటి దేశాలు మాత్రం ధీటుగా స్పందిస్తూ ప్రతీకార సుంకాలు విధిస్తున్నాయి.
ఈ తరుణంలో డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందిస్తూ.. కంపెనీ కార్యకలాపాలను అమెరికాకు తరలించాలని దిగ్గజ సంస్థలకు పిలుపునిచ్చారు. టారిఫ్‌ల సమస్య ఉండదని, వేగంగా అనుమతులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. దిగ్గజ సంస్థలు వారి కంపెనీలను అమెరికాకు తరలించేందుకు ఇది గొప్ప సమయమని పేర్కొన్నారు. ఇప్పటికే యాపిల్ సహా ఇతర అనేక కంపెనీలు మొదలు పెట్టాయని, జీరో టారిఫ్‌లు, విద్యుత్/ ఇంధన అనుమతులు, పర్యావరణ అనుమతుల్లో ఎటువంటి ఆలస్యం ఉండదని చెప్పారు.
వేచి చూడకుండా, తక్షణమే అమెరికాలో మొదలు పెట్టాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. వాణిజ్య సుంకాలు విధించడం మంచి విషయమని జేపీ మెర్గాన్ ఛేజ్ సీఈవో జామీ డిమోన్ గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు. అంతా సవ్యంగా సాగుతోందని, అమెరికా గతంలో కంటే గొప్పగా పని చేస్తోందని చెప్పారు.
అయితే గతంలో టారిఫ్‌లను సమర్థిస్తూ మాట్లాడిన జామీ డిమోన్ అందుకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వెల్లడించారు. ట్రంప్ విధిస్తున్న సుంకాలు మార్కెట్‌ను కుదిపేస్తున్నందున అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు వెళ్లే అవకాశం ఉందని జామీ డిమోన్ తాజాగా అంచనా వేశారు. మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో మొండిబకాయిల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అన్నారు.