Gujarat Titans: రాజస్థాన్‌పై గుజరాత్‌దే పైచేయి.. 58 పరుగులతో విజయం

- వరుసగా నాలుగో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్
- బ్యాట్‌తో మరోమారు చెలరేగిన సాయి సుదర్శన్
- పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. గత రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో విజయం సాధించి వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 217 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 159 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ సంజు శాంసన్ 41 పరుగులు, రియాన్ పరాగ్ 26 పరుగులు చేశారు. చివర్లో షిమ్రన్ హెట్మెయిర్ బ్యాట్‌తో భయపెట్టినప్పటికీ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో హెట్మెయిర్ 52 పరుగులు చేశాడు. జట్టులో 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రాజస్థాన్‌కు ఇది మూడో పరాజయం. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసుకోగా, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ 2 వికెట్లు తీసుకున్నాడు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ బాదుడుతో 6 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు సాధించింది. సుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ మరోమారు చెలరేగిపోయాడు. 53 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. జోస్ బట్లర్, షారూఖ్ ఖాన్ చెరో 36 పరుగులు చేయగా, రాహుల్ తెవాటియా 24 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, తీక్షణ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సాయి సుదర్శన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ 4 విజయాలు, 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఓడిన రాజస్థాన్ 5 మ్యాచుల్లో రెండు విజయాలు, 4 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ-ఢిల్లీ కేపిటల్స్ తలపడతాయి.