Nitish Kumar: బీహార్‌లో ఈదురు గాలులు, వడగళ్ల వాన... పిడుగులు పడి 13 మంది మృతి

ఈదురు గాలులు, వడగళ్ల వాన బీహార్‌లోని పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. పిడుగులు పడి రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, బెగూసరాయ్, దర్బాంగా జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో 9 మంది మృతి చెందారు. మధుబనిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె ఉన్నారు. సమస్తిపూర్‌లోనూ ఓ వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.
పిడుగుపాటుకు మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సీఎం సంతాపం తెలిపారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో విపత్తు నిర్వహణశాఖ జారీచేసే సూచనల ప్రకారం నడుచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.