Ramchandar: ఆటో డ్రైవర్ నిజాయతీ..ప్రయాణికుడు మరచిపోయిన ల్యాప్ టాప్‌లు అప్పగింత

- ప్రయాణికుడు మరిచిపోయిన ల్యాప్ టాప్‌లను పోలీసు స్టేషన్‌లో అప్పగించిన ఆటో డ్రైవర్
- ఆటో డ్రైవర్ నిజాయితీని అభినందించి వెయ్యి రూపాయల నగదు బహుమతి అందజేత
- ఐటీ ఉద్యోగికి ల్యాప్ టాప్ లు అప్పగించిన పోలీసులు
హైదరాబాద్‌లో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. ప్రయాణికుడు మరిచిపోయిన విలువైన వస్తువులను తిరిగి అప్పగించి ఆదర్శంగా నిలిచాడు. చైతన్యపురి సాయి రాఘవేంద్ర రెసిడెన్సీకి చెందిన శ్రీనివాసరావు ఓ ఐటీ ఉద్యోగి. ఈ నెల 3న సీతారాం బాగ్‌లో విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి బయలుదేరారు. గమ్యస్థానం చేరుకున్నాక హడావుడిగా ఆటో దిగి వెళ్లిపోయారు. ఆ తొందరలో తన ఆఫీసుకు సంబంధించిన రెండు ల్యాప్‌టాప్‌లను ఆటోలోనే మరచిపోయారు.
కాసేపటి తర్వాత ల్యాప్‌టాప్‌లు ఆటోలో మరిచిపోయిన విషయం శ్రీనివాసరావుకు గుర్తుకు రావడంతో వెంటనే చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మరోవైపు, ప్రయాణికుడు దిగిపోయిన తర్వాత ఆటోలో రెండు ల్యాప్‌టాప్‌లను గమనించిన డ్రైవర్ రాంచందర్ వాటిని స్వంతానికి వాడుకోవాలనే ఆలోచన చేయలేదు. వెంటనే మహంకాళి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాటిని అప్పగించాడు. తన ఆటోలో ఒక ప్రయాణికుడు ల్యాప్‌టాప్‌లు మరిచిపోయారని పోలీసులకు తెలియజేశాడు.
ఇంతలో చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో ల్యాప్‌టాప్‌లు పోగొట్టుకున్న శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో మహంకాళి పోలీస్ స్టేషన్ అధికారులు వారికి సమాచారం అందించారు. దీంతో బుధవారం రెండు పోలీస్ స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో ఆటో డ్రైవర్ రాంచందర్ సమక్షంలో ఐటీ ఉద్యోగి శ్రీనివాసరావుకు రెండు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ రాంచందర్ నిజాయితీని పోలీసులు మెచ్చుకుని అభినందించారు. అతనికి వెయ్యి రూపాయల నగదు పురస్కారాన్ని అందజేసి సత్కరించారు.