Revanth Reddy: రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం

- ఇచ్చిన హామీలు అమలు చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి అని విమర్శ
- చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మోదీని గాడ్సేతో పోల్చారని వ్యాఖ్య
- తుమ్మితే ఊడిపోయే పదవిని కాపాడుకోవడం కోసం ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి గాడ్సేతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రేవంత్ రెడ్డి తన ఎన్నికల హామీలను నెరవేర్చలేని అసమర్థ ముఖ్యమంత్రి అని విమర్శించారు. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆయన మోదీని గాడ్సేతో పోల్చారని అన్నారు. తుమ్మితే ఊడిపోయే పదవిని కాపాడుకోవడం కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని మరల్చడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని అన్నారు. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఆయన స్థాయికి మించి అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీజేపీని అడ్డుకోవడం నెహ్రూ-ఇందిరా-రాజీవ్-సోనియా-రాహుల్ గాంధీ కుటుంబానికే సాధ్యం కాలేదని, ఇక గాంధీ కుటుంబం మోచేతి నీళ్లు తాగే రేవంత్ వల్ల ఏమవుతుందని ఎద్దేవా చేశారు.