Rahul Gandhi: రేవంత్ రెడ్డి ఆ బిల్లును కేంద్రానికి పంపించారు... దానిపై చర్యలేవి?: రాహుల్ గాంధీ

Rahul Gandhi Criticises Centres Inaction on Telanganas BC Reservation Bill

  • బీసీ రిజర్వేషన్లను పెంచుతూ బిల్లును పంపించారన్న రాహుల్ గాంధీ
  • ఆ బిల్లుపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శ
  • తెలంగాణలో కులగణన విజయవంతంగా నిర్వహించామన్న రాహుల్ గాంధీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీల రిజర్వేషన్లను పెంచుతూ కేంద్రానికి బిల్లు పంపించగా, దానిపై కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్స్‌రే తీయాలని అన్నారు.

దళితులు, ఆదివాసీల సమస్యలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని ఆరోపించారు. చనిపోయాక తన గురించి ప్రజలు ఏం ఆలోచిస్తారనేది అనవసరమని, తాను అనుకున్న పనులు పూర్తిచేశాక ప్రజలు తనను మరిచిపోయినా ఫర్వాలేదని అన్నారు. తెలంగాణలో కులగణన విజయవంతంగా నిర్వహించారని, దీని ఆధారంగా రిజర్వేషన్లు పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

కులగణన వల్ల దేశంలో బీసీల సంఖ్య ఎంత ఉందో తెలుస్తుందని, ఈ విషయంలో దేశానికి తెలంగాణ దారి చూపిందని వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే నిబంధనను తొలగిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉంటే, సంపద మాత్రం వారి చేతిలో లేదని అన్నారు. దేశంలో కులగణన చేపట్టాలని ప్రధాని మోదీని కోరితే తిరస్కరించారని ఆయన ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛపై దాడి అని విమర్శించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా విక్రయిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. వాటిని కేవలం ఇద్దరు వ్యాపారవేత్తలకే అప్పగిస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్రమాల ద్వారా గెలిచిందని ఆరోపించారు. ఆరెస్సెస్, బీజేపీ నిత్యం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు.

Rahul Gandhi
Revanth Reddy
Telangana
BC Reservations
Caste Census
Modi Government
BJP
AIICC
Parliament
Reservation Bill
  • Loading...

More Telugu News