Donald Trump: దెబ్బకు దెబ్బ... అమెరికా సుంకాల పెంపునకు చైనా కౌంటర్ అటాక్

- టారిఫ్ వార్ కు తెరలేపిన ట్రంప్
- చైనాపై అదనంగా 50 శాతం సుంకం
- అమెరికాపై 50 శాతం ప్రతీకార సుంకం విధించిన చైనా
అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన సుంకాల పోరును చైనా అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. చైనాపై మరోసారి 50 శాతం అదనపు సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో చైనాపై అమెరికా సుంకాల మొత్తం 104 శాతానికి చేరుకుంది.
అయితే, చైనా కూడా అదే రీతిలో కౌంటర్ ఇచ్చింది. అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం సుంకాన్ని 84 శాతానికి పెంచుతున్నట్టు చైనా ప్రకటించింది. బెదిరింపులకు లొంగేది లేదని చైనా తేల్చి చెప్పింది. తమ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళతామని, 50 శాతం సుంకాలు విధిస్తే ప్రతిగా తామూ అంతే స్థాయిలో చర్యలు తీసుకుంటామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ ప్రకటించారు. టారిఫ్ యుద్ధాలలో ఎవరూ విజేతలుగా నిలవలేరని అన్నారు.
అమెరికా మార్చిలో చైనాపై 20 శాతం సుంకాలు విధించింది. గత వారమే ట్రంప్ మరో 34 శాతం పెంచారు. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు 104 శాతానికి చేరాయి.