Ronald Ross: ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్‌కు క్యాట్‌లో ఊరట.. తెలంగాణకే కేటాయింపు

- విభజన సమయంలో ఏపీకి కేటాయించిన డీవోపీటీ
- క్యాట్‌ను ఆశ్రయించి పదేళ్లు తెలంగాణలో విధులు నిర్వర్తించిన రొనాల్డ్ రాస్
- మరోసారి క్యాట్‌ను ఆశ్రయించడంతో రొనాల్డ్ రాస్‌కు అనుకూలంగా తీర్పు
సీనియర్ ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్‌కు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్)లో ఊరట లభించింది. ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.
విభజన సమయంలో రొనాల్డ్ రాస్‌ను డీవోపీటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. క్యాట్‌ను ఆశ్రయించి దాదాపు పదేళ్ల పాటు తెలంగాణలోనే విధులు నిర్వర్తించారు. అయితే, గత ఏడాది డీవోపీటీ తిరిగి కొంతమంది ఐఏఎస్‌లను ఏపీకి కేటాయించింది. డీవోపీటీ ఆదేశాల మేరకు రొనాల్డ్ రాస్ గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేశారు.
అయితే, తనను తెలంగాణలోనే కొనసాగించాలంటూ ఆయన మరోసారి క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన క్యాట్ తెలంగాణలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది.
క్యాట్‌లో ఏఐఎస్ అధికారి శివశంకర్ కంటెంప్ట్ పిటిషన్
క్యాట్ ఆదేశాలను డీవోపీటీ అమలు చేయడం లేదంటూ ఐఏఎస్ అధికారి శివశంకర్ క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. శివశంకర్‌ను ఏపీకి కేటాయించాలని, నాలుగు వారాల్లో ఉత్తర్వులు జారీ చేయాలని డీవోపీటీని క్యాట్ ఆదేశించింది. డీవోపీటీ ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఆయన మరోసారి క్యాట్‌ను ఆశ్రయించారు. డీవోపీటీ గడువు కోరడంతో నాలుగు వారాల్లో ఉత్తర్వులు ఇవ్వాలని మరోసారి క్యాట్ ఆదేశించింది.