Harish Rao: యావత్ తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తోంది: హరీశ్ రావు

- ఈ నెల 27న వరంగల్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ
- ఏడాది కాంగ్రెస్ పాలనలో ఏవి పాలో, ఏవి నీళ్లో ప్రజలకు తెలిసిందన్న హరీశ్
- తెలంగాణను కేసీఆర్ నిలబెడితే, రేవంత్ పడగొట్టారని విమర్శలు
ఈ నెల 27న వరంగల్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తోందని అన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఏవి పాలో, ఏవి నీళ్లో ప్రజలకు తెలిసిందని స్పష్టం చేశారు.
ఆనాడు ఎల్ఆర్ఎస్ ఉచితం అని చెప్పారు... ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారు అని హరీశ్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పనితీరు గురించి చెప్పాలంటే మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ అని విమర్శించారు. రైతు బంధు, రుణమాఫీపై ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్ధాలేనని ధ్వజమెత్తారు.
కేసీఆర్ తెలంగాణను నిలబడితే, రేవంత్ రెడ్డి పడగొట్టారని హరీశ్ రావు పేర్కొన్నారు. జీఎస్టీ వాటా తగ్గిందంటే అందుకు కారణం రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని అయిపోయింది... రేవంత్ రెడ్డి పాలన అంతా సగం సగం... ఆగం ఆగం అని విమర్శించారు.