Jalibengi Village: విద్యుత్ స్తంభాలపై మెరుపులు, ఇళ్లల్లో మంటలు.. కర్ణాటక గ్రామంలో భయానక పరిస్థితి

- గ్రామానికి నిలిచిన కరెంట్ సరఫరా
- వంద ఇళ్లల్లో పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలు
- పురాతన వైరింగ్ వల్లే మంటలు వచ్చాయంటున్న గ్రామస్థులు
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలోని జాలిబెంచి గ్రామంలో మంగళవారం రాత్రి భయానక పరిస్థితి నెలకొంది. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే స్తంభాలపై ఒక్కసారిగా మెరుపులు, మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ తరహాలో వైర్లు అంటుకున్నాయి. దీంతో గ్రామంలోని సుమారు వంద ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు పాడైపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా కొన్ని ఇళ్లల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు గ్రామస్థులు గాయపడ్డారు. ఈ పరిణామంతో గ్రామస్థులు భయాందోళనకు గురై స్థానిక సబ్ స్టేషన్ కు సమాచారం అందించారు.
స్పందించిన అధికారులు వెంటనే గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. హుటాహుటిన గ్రామానికి చేరుకుని విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. గ్రామంలో ఏ ఇంట్లో చూసినా కాలిపోయిన స్విచ్ బోర్డులు, మాడిపోయిన ఫ్యాన్లు, పాడైపోయిన టీవీలు, ఫ్రిడ్జ్ లు కనిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్థులు రికార్డు చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే వైర్లు చాలా పాతవైనందువల్లే ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ప్రాథమిక పరిశీలనలో మంగళవారం రాత్రి వీచిన బలమైన గాలుల వల్లే విద్యుత్ తీగలు ఒకదానికొకటి తాకి ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. గ్రామానికి విద్యుత్ సరఫరా చేసే లైన్లు కూడా పురాతనమైనవని చెప్పారు. వీలైనంత తొందరగా మరమ్మతులు చేసి గ్రామానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.