Tamil Nadu Governor: మాజీ గవర్నర్ తమిళిసైకి పితృవియోగం

- తమిళిసై తండ్రి కుమారి అనంతన్ కన్నుమూత
- కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేసిన అనంతన్
- ఒకసారి ఎంపీ, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతన్
తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమళిసై ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి కుమారి అనంతన్ కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో ఆయన ఈ తెల్లవారుజామున చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.
తమిళిసై తండ్రి అనంతన్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. 1977లో నాగర్ కోయిల్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తమిళ రచయితగా, గొప్ప వక్తగా ఆయనకు ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. 1933లో కన్నియాకుమారి జిల్లా కుమారిమంగళంలో ఆయన జన్మించారు. తన తండ్రి కారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులయ్యారు.
రాష్ట్రానికి అనంతన్ చేసిన సేవలకుగాను 2024లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనను అత్యున్నత 'తగైసల్ తమిజార్' పురస్కారంతో సత్కరించింది. 2021లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు 'కామరాజర్' అవార్డును ప్రదానం చేసింది. అనంతన్ మృతి పట్ల రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.